జాతీయ రహదారులను ఆనుకొని శరవేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాలకు మహా ఊరట. అనారోగ్యం లేదా అత్యవసర సమయంలో చికిత్స కోసం దూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రైవేటు దవాఖానల్లో లక్షలకు లక్షలు పోయాల్సిన బాధ ఉండదు. జాతీయ రహదారులకు అనుసంధానంగా శివార్లలో ఐదుచోట్ల ధర్మాస్పత్రులను నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఉపశమనం కల్పిస్తున్నది. ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్, గచ్చిబౌలి, బొల్లారం, పటాన్చెరువులలో సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మించనున్నారు. ఇందులో నాలుగు సాధారణ ప్రజల కోసం కాగా, పటాన్‌చెరువులో కార్మికుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదింటికి టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)గా నామకరణం చేశారు. నూతన దవాఖానలు అందుబాటులోకి వస్తే ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి నగరానికి వచ్చే వారికి అధునాతన వైద్యసేవలు అందనున్నాయి. పరిశ్రమల్లో జరిగే ప్రమాద బాధితులకు పటాన్‌చెరువులో ప్రత్యేక దవాఖాన నిర్మాణం వల్ల ఎంతో మేలు జరగనుంది.
ఉమ్మడి రాష్ట్రంలో సర్కార్ దవాఖానకు రాను బిడ్డో అన్న జనం.. స్వరాష్ట్రంలో సర్కార్ వైద్యానికైతేనే.. సై అనేలా దవాఖానలను తీర్చిదిద్ది మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధానికి నలువైపులా ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్ దవాఖానలతో పాటు ఓ మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మించాలని నిర్ణయించారు. అధునాతన, నాణ్యమైన సేవలందించి దేశానికి ఎయిమ్స్ వలే, రాష్ట్రానికి టిమ్స్ పేరును బ్రాండ్‌గా మార్చాలని వైద్యారోగ్య శాఖ, ఆర్అండ్బీ శాఖలను కేబినెట్ ఆదేశించడంతో, ఆ దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. వచ్చే రెండేళ్లలోనే వీటి నిర్మాణాలు పూర్తి చేసి, వీలైనంత త్వరగా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించగా.. వైద్య సేవలు సైతం అందుబాటులోకి రానుండటంతో అభివృద్ధి మరింత ఊపందుకున్నది.తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన టిమ్స్, మల్టీ స్పెషాలిటీ దవాఖానల ఏర్పాటు నిర్ణయం అభివృద్ధికి మరింత ఊపునిస్తున్నది. నగరం నలువైపులా, జాతీయ రహదారులను ఆనుకుని గచ్చిబౌలి, అల్వాల్, ఎల్బీనగర్, సనత్‌నగర్ ప్రాంతాల్లో టిమ్స్ దవాఖాలను ఏర్పాటు చేస్తుండగా, కార్మికుల కోసం ప్రత్యేంగా ముంబాయి జాతీయ రహదారిపై పటాన్చెరులో మల్టీ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఐదు దవాఖానలను గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తరహాలో ఏర్పాటు చేయనుండటంతో నగర శివారు ప్రాంతాల్లో నివాసముంటున్న వారికే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి నగరానికి వచ్చే వారికి ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.
నగరానికి దక్షిణ – పడమర దిక్కున గచ్చిబౌలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన టిమ్స్ (గచ్చిబౌలి సూపర్‌స్పెషాలిటీ) దవాఖాన ఐటీ కారిడార్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఎంతో అనుకూలంగా ఉండనున్నది. దక్షిణ ప్రాంతంలో ఉన్న శంషాబాద్, బెంగళూరు జాతీయ రహదారి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా కేవలం 20-30 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడికి చేరుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ఉస్మానియా దవాఖానకు వెళ్లేవారు. ట్రాఫిక్ చిక్కులను ఛేదించుకుని అక్కడికి వెళ్లినా.. రద్దీ కారణంగా వెంటనే చికిత్స అందించలేని పరిస్థితి. గచ్చిబౌలి టిమ్స్‌తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సత్వరమే అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నగరానికి ఉత్తరం వైపున బొల్లారంలో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానతో శివారు ప్రాంతాలైన మేడ్చల్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట, కీసర ప్రాంతాలతో పాటు నాగ్‌పూర్ జాతీయ రహదారి మీదుగా వచ్చే నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల వాసులు, రాజీవ్ రహదారి మీదుగా వచ్చే సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల వాసులకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతాలకు చెందిన వారంతా గాంధీ దవాఖానకు వచ్చివెళ్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని
తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
నగరానికి నలుదిక్కుల ఏర్పాటు చేస్తున్న టిమ్స్, మల్టీ స్పెషాలిటీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు ప్రధానంగా కోరుకునేవి విద్య, వైద్య సేవలతో పాటు రోడ్లు, మంచినీరు, విద్యుత్, ప్రజా రవాణా వ్యవస్థలు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ స్థిర నివాసమేర్పరుచుకుని వాలిపోతారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగురోడ్డు, దాన్ని అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్లు, జాతీయ రహదారులు ఉన్నాయి. అంతేకాకుండా మౌలిక వసతులకు కొదవలేకుండా కల్పించారు. ఇప్పుడు కొత్తగా వైద్య సేవలు సైతం అందుబాటులోకి రానుండటంతో రాజధాని నలువైపులా అభివృద్ధి మరింత వేగంగా జరిగేందుకు అవకాశం ఉందని పట్టణ ప్రణాళిక నిపుణులు పేర్కొంటున్నారు. పట్టణాభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం నలువైపులా ఉండేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నగర జనాభా, రాష్ట్ర జనాభా పెరిగిపోతున్నది. ప్రజల వైద్య అవసరాలు తీర్చేలా, నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మంత్రులు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, సాయన్న, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, జిల్లా కలెక్టర్ శ్వేతామహంతిలతో కలిసి పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, ఆర్అండ్బీ, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆస్పత్రులు నిర్మించే స్థలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల ఇబ్బందులు తొలగించేలా, నాణ్యమైన ఉచిత వైద్యం అందేలా ఇవి ఏర్పాటు కానున్నాయన్నారు. కరోనా సమయంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న టిమ్స్ గచ్చిబౌలి గొప్పగా సేవలందిస్తున్నదని, ఇప్పుడు మిగతా మూడు దిక్కులా టిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. గ్రేటర్ ప్రజలతో పాటు, ఆయా దిక్కున ఉండే జిల్లాల ప్రజలకు ఇవి విలువైన వైద్య సేవలు అందిస్తాయన్నారు. ఒకవైపు టిమ్స్ ఆస్పత్రులు, మరో వైపు నూతన మెడికల్ కాలేజీలు తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
నగరానికి పడమర-ఉత్తర అభిముఖంగా సనత్‌నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసే టిమ్స్ సూపర్‌స్పెషాలిటీ దవాఖానతో కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, బోరబండ, చందానగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరువు ప్రాంతాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతాలకు చెందిన వారంతా గాంధీ దవాఖాన లేదంటే నిమ్స్‌కు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కొత్తగా ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించే టిమ్స్ సనత్‌నగర్ ముంబాయి జాతీయ రహదారిపైనే ఉంది. దీంతో శివారు ప్రాంతాల ప్రజలు ఇక్కడకు వచ్చివెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది.
నగరానికి తూర్పు దిక్కున గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో నిర్మించే టిమ్స్ ఎల్బీనగర్ సూపర్ స్పెషాలిటీ దవాఖానతో హయత్‌నగర్, వనస్థలిపురం, తుర్కయాంజాల్, నాగోల్, నాగార్జునసాగర్ హైవే ప్రాంతాల వారితో పాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపుల వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలకు చెందిన వారు ఉస్మానియా దవాఖానకు రావాల్సి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా కార్మికులు ఉంటున్న ప్రాంతం పటాన్చెరు. దీని చుట్టు పక్కల ప్రాంతాల్లోనే పదుల సంఖ్యలో పారిశ్రామికవాడలు, వేలసంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కార్మికుల కోసం ప్రత్యేకంగా పటాన్చెరు ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మించాలని నిర్ణయించింది. హైదరాబాద్-ముంబాయి జాతీయ రహదారిపై ఉన్న పటాన్చెరు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి గాంధీ లేదా నిమ్స్‌కు రావాల్సి ఉంటుంది. దానికి బదులుగా పటాన్ చెరులోనే మల్టీస్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నారు. దీనివల్ల గంట నుంచి గంటన్నర ప్రయాణం ఆదా కావడమే కాకుండా అత్యవసర సమయాల్లో రోగులకు వెంటనే చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుంది.
ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఆ ప్రాంత ప్రజలకు కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదే పనిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పించిన ప్రభుత్వం వైద్య సేవల కోసం ఒకేసారి ఐదు పెద్దాస్పత్రులను నగరం నలుమూలలా ఏర్పాటు చేయడం విప్లవాత్మకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. రాష్ట్రం ఏర్పాటైన సమయంలో తెలంగాణ డెవలపర్స్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో నగరంపై ఒత్తిడి తగ్గించేందుకు మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వానికి ఇచ్చాం. పెద్దాసుపత్రులు, యూనివర్సిటీల అనుబంధ కళాశాలలు, స్టేడియంలు, శాటిలైట్ టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయాలని కోరాం. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నది. – జీ.వీ.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్ అసిసోయేషన్.
ఒక్కో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 800నుంచి 1000 దాకా పడకలు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో 30 పైగా స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, రుమటాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ సహా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సర్జరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అధునాతన వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన జరుగనున్నది. అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు, సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు చేరువ కానున్నది. కొత్తగా ఏర్పాటు చేయబోయే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్ మహానగరంలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దాస్పత్రులంటే ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానలు. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలంతా దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన వీటినే ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ మూడు పెద్దాస్పత్రులు నగరం నడిబొడ్డున ఉండటంతో ఇతర జిల్లాలు, నగర శివారు ప్రాంతాల నుంచి రోగులు రావాలంటేనే ఎన్నో చిక్కులు దాటుకుంటూ రావాలి. వీటిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నగర నలుమూలలా సకల వసతులతో కూడిన పెద్దాసుపత్రులను(టిమ్స్, మల్టీ స్పెషాలిటీ) నిర్మించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. వీటి నిర్మాణం త్వరలోనే చేపట్టనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే.. శివారు ప్రాంతాల ప్రజలు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రులకు రావాల్సి అవసరం ఉండదు.