సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. గత నెల 16న సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆరుగురు మరణించారు. బాధిత కుటుంబాలకు ఒకొకరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం తరఫున అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఈ మేరకు మంజూరైన చెకులను మంగళవారం మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు హోంమంత్రి మహమూద్ అలీ, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా బాధితులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతులంతా ఎంతో భవిష్యత్ ఉన్న చిన్న వయసు పిల్లలని, ఈ దుర్ఘటన విచారకరమన్నారు. ఘటన పై ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, తాసీల్దార్ శైలజ తదితరులు ఉన్నారు.