Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఉద్యోగం చేస్తూ సాఫీగా సాగుతున్న జీవితం.. వచ్చే జీతానికి అదనంగా సంపాదించాలనే ఆశ కొందరిని సైబర్‌నేరగాళ్ల వలలోకి నెట్టి నిండా ముంచేస్తోంది. ఇందులో ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద హోదాలలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉంటున్నారు. ఇలాంటి సైబర్‌మోసాలపై కనీసం పోలీసు విభాగంలో పనిచేస్తున్న వారికైనా అవగాహన ఉండాలి. కానీ కొత్తగా విధుల్లోకి వచ్చిన పోలీసులు సైబర్‌నేరగాళ్లు చెప్పే మాటలు సులభంగా వింటూ మోసాపోతున్నారు.
సాధారణంగా అందరికి తెలిసినంటే రివ్యూస్ అనేవి నేడు అన్ని వ్యాపారాల అభివృద్ధ్ది ఎంతో మేలు చేస్తుంటాయి. అలాంటిది ఇంటర్నెట్లో నుంచి వచ్చే వ్యాపారులకు మరింత రివ్యూస్ కోసం ప్రాధాన్యత ఇస్తుంటారు. దీనినే సైబర్‌నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటూ బడా కంపెనీల నుంచి మేసేజ్ పంపించినట్లు పంపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఇదంతా నిజమే కదా అనే భ్రమలో ఉంటారు. వాట్సాఫ్, టెలిగ్రామ్ మేసేజ్‌లు చూసి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసే ఉద్దేశంతో కొందరు ఆయా మేసేజ్‌లకు ప్రేరేపితమవుతున్నారు.
ఇలా ఆయా మేసేజ్‌లకు స్పందించిన వారు అదృష్టం పరీక్షించుకుందామని ఆయా గ్రూప్‌లలో జరిగే చర్చలను చూసి అంతా నిజమని నమ్మేస్తున్నారు. తీరా సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు టాస్క్‌లు నిజమని నమ్మి, డబ్బులు కట్టి మధ్యలో ఇరుక్కుపోతున్నారు. అలా మధ్యలోకి వెళ్లిన వారు వెనక్కి రాలేక.. ముందుకు వెళ్తేనే పెట్టిన పెట్టుబడి బయటకు రాబట్టవచ్చనే భావనతో చాలా మంది సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు డబ్బులు పెట్టి తీరా మోసపోతున్నారు. ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గృహిణిలు, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు బాధితులవుతున్నారు.
పీర్జాదిగూడకు చెందిన డిగ్రీ చేసిన బాధితుడు ఇటీవల పోలీసు విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగంలోకి చేరాడు. గత ఏడాది నవంబర్ 22వ తేదీన టెలిగ్రామ్ ఐడీకి పార్ట్‌టైమ్ ఉద్యోగం గూర్చి ఒక మేసేజ్ వచ్చింది. పార్ట్‌టైమ్ జాబ్ కావాల్సిన వారు సంప్రదించాలంటూ సూచించారు. ఆ మేసేజ్‌కు స్పందించిన కానిస్టేబుల్ ఒకే అని చెప్పాడు. వెంటనే హెచ్ఆర్ మేనేజర్ అంటూ మేసేజ్‌లు పంపించారు. హోటల్ బుకింగ్స్, హోటల్ రివ్యూస్ గూగుల్‌లో రాయాల్సి ఉంటుందని, మీకు ఒక ఐడీ ఇస్తాం దానికి రూ. 10 వేలు బోనస్ క్రెడిట్ అవుతుంది, ఒకో టాస్క్‌లో రూ. 90 హోటల్స్ బుకింగ్ ఉంటాయి అంటూ వివరించారు.
వాళ్లిచ్చిన టాస్క్‌లు పూర్తి చేయడంతో బాధితుడి బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని రూ. 900 క్రెడిట్ చేశారు. ఆ తరువాత మీరు గోల్డెన్ స్కీమ్‌లో చేరండి, ఈ స్కీమ్‌లో చేరితే ఐదింతల కమిషన్ ఎక్కువ వస్తుందంటూ నమ్మించారు. రూ. 10 వేలు చెల్లించిన బాదితుడికి ఒక లింక్‌ను అందించడంతో అందులో అతని టాస్క్‌లు కన్పించడం, స్కీన్ప్రై ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత లాభం వచ్చిందని కన్పిస్తోంది. మీరు ఎదైనా ఇబ్బంది పడితే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయాలంటూ సూచనలు చేశారు.
రూ. 10 వేలు డిపాజిట్ చేసిన బాధితుడికి రూ. 18223 క్రెడిట్ చేశారు. ఆ తరువాత మరికొంత డిపాజిట్ చేయడంతో స్కీన్ప్రై మైనస్‌లో డబ్బులు సూచించడంతో మీకు మీ అమౌంట్ క్రెటిట్ కావాలంటే మరో అడుగు ముందుకేయాలని అందుకు కొంత డబ్బు చెల్లించాలంటూ నమ్మిస్తూ 25 దఫాలుగా రూ.17.70 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలలో డిపాజిట్ చేసి మోసపోయాడు. ఇంకా డబ్బు అడుగుతుండడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.