వెంగళరావునగర్, : మారుతున్న ఆహార అలవాట్లు, కాలుష్యం, జన్యుపరంగా వచ్చే దురద (అలర్జీ) సమస్యలను నివారించేందుకు ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ దవాఖానలో ప్రత్యేకంగా అలర్జీ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారి ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌ను బుధవారం వైద్యవిద్య సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్జీ సమస్యను ప్రస్తావించారని, అనేకమంది అలర్జీతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో చెస్ట్ హాస్పిటల్లో దీన్ని ప్రారంభించామన్నారు.
అలర్జీ వైద్యం ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చాలా ఖరీదని, అలర్జీలు ఒక్కోసారి ప్రాణాపాయంగా మారే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. అలర్జీకి చికిత్స కోసం క్లినిక్‌లో పనిచేసే వైద్య సిబ్బందికి పూర్తి శిక్షణ ఇచ్చామని, రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వైద్యులకు అలర్జీ చికిత్స విధానాల్లో శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ మాట్లాడుతూ ప్రతి బుధవారం అలర్జీ క్లినిక్‌లో వైద్య సేవలు అందుతాయని, ప్రభుత్వ ఆధీనంలో నడిచే అలర్జీ క్లినిక్ రాష్ట్రంలో ఇదే మొదటిదన్నారు. అంతకుముందు డీఎంఈకి క్లినిక్ ప్రత్యేకతలు, చికిత్స విధానం, పరీక్షలను వైద్య నిపుణులు వివరించారు. అనంతరం క్లినిక్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ నరేందర్, డాక్టర్ నళిని తదితరులు పాల్గొన్నారు.