JEE Advanced | శేరిలింగంపల్లి, జూన్ 2: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర గౌలిదొడ్డి కళాశాల విద్యార్దులు ఘన విజయం సాధించారు. 80 మంది విద్యార్దులు పరీక్షకు హాజరవ్వగా 21 మంది విద్యార్దులు డైరెక్ట్ ర్యాంకులు, 19 మంది విద్యార్థులు ప్రిపరేటరి ర్యాంకులు సాధించారు.
ఆర్ అశోక్ 82 వ ర్యాంకు, ఏ.రాజశేఖర్ 162, ఏ .శివమణి 1150, పీఏవీ శ్రీనివాస్ 1356, పీ.విజ్వల్ సింహ 1632, ఏం.పవన్ దీప్ 1776, పీ.భాను తేజ 1995 వ ర్యాంకులు సాధించారు.ఈ సందర్బంగా విద్యార్దులను గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని, సంయుక్త కార్యదర్శులు, స్టేట్ ఆఫీసర్ భీమయ్య , కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, వైస్ ప్రిన్సిపాల్ గణేష్ లు అభినందించారు.
కాగా, జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో (JEE Advanced Results) ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు సత్తాచాటారు. కేటగిరీ వారి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులిద్దరు టాపర్లుగా నిలిచారు. ఈడబ్ల్యూఎస్ ఆలిండియా టాపర్‌గా వంగాల అజయ్‌రెడ్డి, ఓబీసీ ఎన్సీఎల్ ఆలిండియా టాపర్‌గా డీ. జ్ఞాన రుత్విక్ సాయి నిలిచారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 360 మార్కులకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది.
హైదరాబాద్ జోన్ నుంచి టాపర్లు
అర్నవ్ సింగ్- 09 (ఆలిండియా ర్యాంకు)
వడ్లమూడి లోకేష్- 10
డీ. జ్ఞాన రుత్విక్ సాయి- 18
వంగాల అజయ్‌రెడ్డి- 19
ఏ. అనిరుద్‌రెడ్డి- 20
కే. రసజ్ఞ- 78
హైదరాబాద్ జోన్ నుంచే అత్యధికులు..
ఈ సారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.87లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1. 80లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 54,378 మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో అబ్బాయిలే అధికంగా ఉన్నారు. 44వేల మంది అబ్బాయిలు క్వాలిఫై అయితే, అమ్మాయిలు కేవలం 9,404 మంది మాత్రమే అర్హత సాధించారు. అయితే ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి రికార్డుస్థాయిలో విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. మొత్తం ఏడు జోన్లు ఉండగా, హైదరాబాద్ జోన్ నుంఇ ఈ సారి రికార్డుస్థాయిలో 12,946 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలున్నాయి. అడ్వాన్స్‌డ్‌లో టాప్ 10, టాప్ 100లోను మనోళ్లు సత్తాచాటారు. మిగతా జోన్లతో పోల్చితే మన దగ్గరి నుంచే టాప్ -500లో అత్యధికులు నిలిచారు. టాప్ 10లో ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి ఇద్దరు విద్యార్థులున్నారు. టాప్ 100లో 23 మంది, టాప్ 200లో 57 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులే కావడం గమనార్హం. టాప్ 300లో 78 మంది, టాప్ 400లో 116, టాప్ 500లో 136 ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులున్నారు.