Sriramanavami | అమీర్‌పేట, మార్చి 14 : భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవానికి భక్తులు భక్తి పూర్వకంగా సమర్పించుకునే కోటి గోటి తలంబ్రాల సేవ మోడల్ కాలనీ కమ్యూనిటీ హాల్లో భక్తిశ్రద్ధలతో జరిగింది. భద్రాచలం నుండి వచ్చిన వడ్లను భక్తులు తమ గోటితో వలిచి తలంబ్రాలుగా చేసి స్వామివారికి సమర్పిస్తారు. సనత్ నగర్‌కు చెందిన సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి ఆధ్వర్యంలో భద్రాచలంలో శ్రీరాముల వారికి జరిగే కళ్యాణోత్సవానికి ”గోటి తలంబ్రాలు” సిద్ధం చేసే బృహత్తర కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం మోడల్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు.
ఈ కోటి కోటి తలంబ్రాల సేవకు చిన్న పెద్ద అని తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాచలం నుండి వచ్చిన వడ్లను తారక నామం పట్టిస్తూ గోటితో వలిచిన బియ్యాన్ని స్వామి వారి కల్యాణోత్సవానికి ఉపయోగించే తలంబ్రాలుగా వీటిని సిద్ధం చేయడం జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. భక్తులే స్వామివారికి తలంబ్రాలను సిద్ధం చేసే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు సేవలో పాల్గొన్న భక్తులు తెలిపారు.