Raja singh | హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని బీజేపీ నాయకత్వానికి రాజాసింగ్ తేల్చిచెప్పారు. ఇవాళ రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజాసింగ్ సవాల్ విసిరారు.
నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే.. నేనూ చేస్తాను. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే ఇద్దరం కలిసి ఇండిపెండెంట్లుగా ఎన్నికలకు వెళ్దాం. అప్పుడు ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రంలో బీజేపీ నాశనమైంది. ప్రస్తుత అధ్యక్షుడు రామచందర్ రావు రబ్బర్ స్టాంప్‌గా మారారని రాజాసింగ్ ఆరోపించారు.
గత మూడు ఎన్నికల్లోనూ నన్ను గోషామహల్ ప్రజలే నన్ను గెలిపించారు. బీజేపీ నాకు ఎలాంటి సహకారాలు అందించలేదు. పార్టీలో నేను ఎలాంటి పదవి ఆశించలేదు. ఇప్పుడున్న కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదు. ఈ కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా. పార్టీని సర్వనాశనం చేస్తున్నదెవరో మరోసారి చెప్తాను. ఢిల్లీ పెద్దలు నాకు తరచూ ఫోన్ చేసి మాట్లాడుతారు. నాకు ఎప్పట్నుంచో కేంద్రం పెద్దల ఆశీర్వాదం ఉంది. నేను ఎప్పటికీ బీజేపీ నేతనే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరను. పదవీ భయంతోనే కొందరు మాట్లాడడం లేదు అని రాజాసింగ్ పేర్కొన్నారు.