సిటీబ్యూరో, జూలై18, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కొలువుల్లో ప్రమోషన్ కావాలంటే కేవలం అనుభవం, ప్రతిభ ఉంటేనే సరిపోదు. వాటిన్నింటితో పాటు లంచాలివ్వడం కూడా తెలిసుండాలి. అప్పుడే మనకు నచ్చినచోట పోస్టింగ్ వేస్తారు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అంతేకానీ డబ్బులు ఇవ్వకుండా దగ్గరి ప్రాంతాల్లో పోస్టింగ్ కావాలి..రూల్ ప్రకారం ప్రమోషన్లో నాపేరే ముందుండాలి అని చెబితే ప్రమోషన్ కాదు కదా ఉన్న ఉద్యోగానికి కూడా ఎసరొచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 11 మంది గ్రేడ్-1 నర్సింగ్ ఆఫీసర్లకు పదోన్నతులు కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లోని గాంధీ జనరల్ ఆసుపత్రిలో పోస్టింగ్ కోసం ఓ నర్సింగ్ అధికారి తన ప్రయత్నాలను బలంగా చేస్తున్న తరుణంలో వరాలిచ్చే దేవతలాగా డీఎంఈ కార్యాలయంలోని ఓ మహిళా అధికారి ప్రత్యేక్షమైంది. గాంధీలో పోస్టింగ్ ఇప్పించడంతో ప్రమోషన్ వచ్చిన వారందరికీ దగ్గరి ప్రాంతాల్లోనే పోస్టింగ్‌లు సైతం ఇప్పిస్తానని అందుకు ఒక్కొక్కరూ రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రమోషన్‌తో పాటు కోరిన చోట పోస్టింగ్ ఇస్తానంటే వాళ్లు మాత్రం ఎందుకు ఎదురుచెప్తారు.
ప్రమోషన్ పొందిన తమ సహోద్యోగితో పాటు డీఎంఈ కార్యాలయంలో పనిచేసే అధికారి కూడా ఉన్నారనే నమ్మకంతో పదకొండు మందిలో తొమ్మిది మంది గ్రేడ్-1 నర్సింగ్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఒక్కొక్కరూ రూ.20వేలు చెల్లించినట్లు సమాచారం. డబ్బులైతే ఇచ్చారు కానీ న్యాయం మాత్రం జరగలేదు. కేవలం కొందరికి మాత్రమే అనుకున్న స్థానాల్లో పోస్టింగ్ ఇప్పించగా, మిగతావారికి దూర ప్రాంతాలకు పోస్టింగ్‌లు వచ్చాయని తమకు అన్యాయం జరిగిందంటూ లోలోపలే వాపోతున్నారు. మరోవైపు నిబంధనలు తుంగలో తొక్కి ఇస్టానుసారంగా ప్రమోషన్ల విషయంలో ఆ అధికారి జోక్యం చేసుకొని నర్సింగ్ అధికారుల నుంచి లంచం డిమాండ్ చేయడం చర్చానీయాంశమైంది.
రాష్ట్రవ్యాప్తంగా 11 గ్రేడ్-1 నర్సింగ్ అధికారుల ప్రమోషన్ ప్రక్రియ గందరగోళానికి దారితీసింది. బుధవారం పలువురు నర్సింగ్ అధికారులు తమకు జరిగిన అన్యాయం పై డీఎంఈ కార్యాలయం వద్ద నిరసన తెలపడం తెలిసిందే. సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వకుండా నిబంధనలు తుంగలో తొక్కి ఇస్టానుసారంగా ప్రమోషన్లు ఇవ్వడం గమనార్హం. సీనియారిటీ లిస్టులో ఉన్నవారికి కాకుండా వారి వెనుక వరుసలో ఉన్నవారికి ఇవ్వడంపై నర్సింగ్ యూనియన్ నేతలు తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నారు.
ఈ పరిస్థితులను పరిశీలిస్తే ప్రమోషన్లు, పోస్టింగుల విషయంలో అధికారులు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారన్న వాదన నిజమనే తెలుస్తోంది. ప్రమోషన్ల పేరుతో జరుగుతున్న ఈ దందాను కట్టడి చేయకుంటే ప్రతి పనికి రేటును నిర్ణయించే పరిస్థితి నెలకొంటుంది. కాసులు పోస్తే కానీ పనులు జరగవన్న పరిస్థితి వైద్యశాఖలో సైతం నెలకొంటుంది. పై అధికారులు దృష్టిసారించి ఈ తరహా పనులపై కఠిన చర్యలు చేపట్టడం అత్యంత అవసరం.