ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల కురుమలకు స్థానం కల్పించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. గొల్ల కురుమలకు జరుగుతున్న అన్యాయాలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైదులు యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 28 లక్షల జనాభా కలిగిన గొల్లకురుమలకు మంత్రి పదవి కేటాయించకపోవడం సరికాదన్నారు. జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల కురుమలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రెండు ఎమ్మెల్సీ పదవులు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత పదవులలో ప్రాముఖ్యం కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గొల్లకురుమ విద్యార్థి నాయకులకు నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నచోట గొల్లకురుమలకు డీసీసీ పదవులలో చోటు కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఎస్.ఎన్.టీ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సబ్‌ప్లాన్ కమిటీ ఏర్పాటు చేయాలి..
తెలంగాణలో గొల్లకురుమల గొర్రెల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు సమకూరుతున్నాయని, వాటిని తిరిగి గొల్లకురుమల అభివృద్ధికి కేటాయించాలని అభిప్రాయపడ్డారు. గొల్లకురుమల అభివృద్ధి కోసం సబ్‌ప్లాన్ కమిటీ ఏర్పాటుచేసి రూ.10వేల కోట్లు నిధులు కేటాయించాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ చైర్మన్‌తో పాటు డైరెక్టర్లలో 50% గొల్లకురుమలకి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూము నవీన్, నూకల మధు, వికాస్, సురేష్, కార్తీక్, అభిలాష్, రమేష్, శ్రీధర్, అనిల్, శంకర్, నవీన్, వినోద్, శ్రీనివాస్, సురేష్, శివ, మోహన్, సంతోష్, శ్రీకాంత్, శేఖర్, శోభన్, బాలు తదితరులు పాల్గొన్నారు.