Hyderabad | గోల్నాక, మే 8 : అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారం దుకాణంలో చోరీకి పాల్పడిన ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. డీఐ హాఫీజ్ ఉద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ మొఘల్పురాకు చెందిన సయ్యద్ ఆరిఫ్ ఉద్దీన్ (40), షేక్ అహ్మద్ ఉద్దీన్(45), నసీమా బేగం(40), కయాం సుల్తానా(70) కలిసి ఈ నెల 5న అంబర్పేట తిరుమలనగర్లోని భవన్ లాల్ బంగారం షాపునకు వెళ్లారు. అధిక బరువు గల బంగారు గాజులు చూపించాలని కోరారు. ఒక ట్రేలో బంగారు గాజులు చూపిస్తుండగా షాపు యజమాని దృష్టి మళ్లించి రూ. 2 లక్షల విలువగల బంగారు గాజులు దొంగతనం చేసి దానికి బదులుగా రోల్డ్ గోల్డ్ బంగారు గాజులను అక్కడ ఉంచి ఉడాయించారు. ఇది గమనించిన యజమాని అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలించారు. దొంగతనానికి పాల్పడ్డ నిందుతుల్లో ముగ్గురిని గురువారం అరెస్ట్ చేసి, చోరికి గురైన బంగారు గాజులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.