Bowenpally | బొల్లారం, మే 5: కేర్ టేకర్ గా పని చేస్తూ ఆభరణాలు అపహరించిన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ తిరుపతి రాజు వివరాల ప్రకారం.. బోయిన్పల్లి ఆనంద్ నగర్‌కు చెందిన దండిభట్ల శివరామకృష్ణ నివాసంలో వృద్ధురాలైన తన అత్తమ్మకు జగద్గిరిగుట్ట కు చెందిన కంచర్ల సువర్ణ (48) కేర్ టేకర్‌గా గత ఏడాది నుండి పనిచేస్తున్నది. కాగా ఈ నెల 3న రోజు సువర్ణ పని నిమిత్తం ఇంటికి వచ్చి మధ్యాహ్నం 3:30 గంటలకు తిరిగి వెళ్ళింది.
ఆమె వెళ్లిన కొద్దిసేపటికే ఇంట్లో సుమారు రూ .8 లక్షలు విలువైన ఆభరణాలు 112 గ్రాములు, మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయినట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ మేరకు శివరామకృష్ణ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ గోపాల కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఇంట్లో కెరీటేకర్ గా పనిచేస్తున్న సువర్ణను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నది. ఈ దర్యాప్తును వేగవంతం చేసి చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్ఐ తుల్జారాం, డీఐ సర్దార్ నాయక్, సీఐ తిరుపతి రాజ్, క్రైమ్ సిబ్బందిని ఏసీపీ గోపాలకృష్ణమూర్తి అభినందించారు.