భక్తులు సమర్పించిన బంగారంతో తయారు
జూన్ 5న అమ్మవారి కల్యాణం
2.5 కేజీల బంగారు బోనం
తిరుమల తరహాలో ఎల్లమ్మ లడ్డూ
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అమీర్‌పేట్, మార్చి 31 : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న బంగారంతో 2.5 కేజీల బోనం తయారు చేయాలని నిర్ణయించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన చాంబర్లో గురువారం దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 5న జరుగనున్న ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం నాటికి బంగారు బోనం తయారు చేయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వెండి తొడుగుతో ఉన్న రుద్రాక్ష మండపం స్థానంలో రాతి మండపాన్ని బంగారు తాపడంతో తీర్చిదిద్దాలని, పోచమ్మ, నాగదేవత అమ్మవార్ల ఆలయ తలుపులు, రాజగోపురం వద్ద ఉన్న దర్వాజకు వెండి తాపడం చేయించాలని మంత్రి ఆదేశించారు. అమ్మవారి కల్యాణోత్సవ విగ్రహం చిన్నదిగా ఉన్నదని, 5 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి ఆధ్వర్యంలో తమిళనాడులోని కుంభకోణం నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రికి వివరించారు.
దేవాలయం వెనుక ఉన్న కల్యాణ మండపం శిథిలావస్థకు చేరిందని అధికారులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మండపాన్ని పూర్తి స్థాయిలో తొలగించి, అదే స్థానంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించాలని, ఇందులో కల్యాణ మండపం, అన్నదాన సత్రం, భక్తులకు వసతి ఏర్పాట్లు ఉండేలా తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి లడ్డూ తరహాలోనే అమ్మవారి లడ్డూను కూడా తీర్చిదిద్దే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ త్వరలోనే తిరుపతికి వెళ్లి లడ్డూ తయారీ విధానంపై అధ్యయనం చేస్తుందని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ మంత్రికి వివరించారు. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత రుచిగా తయారు చేయించి భక్తులకు అందించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిబాబా గౌడ్, ఈవో ఎస్.అన్నపూర్ణ, పాలక మండలి ప్రతినిధులు అశోక్ యాదవ్, కట్టా బలరాం, ఉమానాథ్ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.