సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : గోదావరి జలాలను ఎత్తిపోసి నగరానికి నీరందించేందుకు జలమండలి సిద్ధమైంది. శనివారం నుంచి ఎల్లంపల్లి నుంచి ఐదు పంపుల ద్వారా జలాలను ఎత్తిపోసి నగరానికి 168 ఎంజీడీల మేర నీటిని అందించనున్నారు. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను అత్యవసర పంపింగ్ ద్వారా నగరానికి రోజూ 270 ఎంజీడీలను తరలిస్తున్నట్లుగానే …నగర దాహార్తిలో మరో ముఖ్యమైన గోదావరి జలాల తరలింపులోనూ ఎమర్జెన్సీ పంపింగ్ అనివార్యమైంది. గతేడాది వర్షాభావ పరిస్థితులతో రెండు నెలలుగా కృష్ణా జలాలను ఎత్తిపోస్తూ రోజూ మూడు దశల్లో 270 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి జలాల తరలింపులో ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా.. కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లిలోకి వరద నీరు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో నీటి నిల్వలు 4.5 టీఎంసీల మేర ఉండగా, ముందస్తుగానే అప్రమత్తమైన జలమండలి అధికారులు ఎల్లంపల్లి రిజర్వాయర్ బ్యాక్ చానల్ ముర్ముర్ ఫోర్సోర్ వద్ద అత్యవసర పంపింగ్ మోటర్లను ఏర్పాట్లు చేశారు. రెండు రోజులుగా ఐదు పంపులను సిద్ధం చేసి.. ట్రయల్ రన్ చేపట్టారు. శనివారం నుంచి ఒక్కో పంపు నుంచి 25 క్యూ సెక్కుల మేర తొలుత ఎత్తిపోసి యథావిధిగా గోదావరి జలాలను అందించి తాగునీటి కొరత లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.