సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల మంచినీటి అవసరాలను తీర్చేందుకు 20 టీఎంసీల నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ చెరువులకు గోదావరి జలాలను తరలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గండిపేటలోని ఉస్మాన్‌సాగర్ వద్ద గోదావరి మంచినీటి పథకం ఫేజ్-2,3 పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… కోటి మందికి పైగా ఉన్న హైదరాబాద్‌కు అదనంగా గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు రూ.7,360 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, గండిపేటలో జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాటలు ప్లే చేశారు. శంకుస్థాపన ప్రాంగణానికి సీఎం రాగానే ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై రూపొందించిన పాటను ప్లే చేయాలని వ్యాఖ్యాత సౌండ్ సిస్టమ్ వారికి సూచించారు. దీంతో శంకుస్థాపన పూర్తయి, సీఎం రేవంత్‌రెడ్డి సభా వేదికపైకి వచ్చేదాకా పాటను పెద్ద సౌండ్‌తో వినిపించారు. దీంతో అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు.