మల్కాజిగిరి, ఫిబ్రవరి 4: నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు కోసం దరఖాస్తులు, వారి వివరాలను డీవైఎస్వో బలరామ్ శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తుతోపాటు కుల, ఆదాయం, రేషన్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పాన్ కార్డు, ఆధార్ కార్డులను పరిశీలించారు. సరైన పత్రాలు జత చేయని వాటి వివరాలు నమోదు చేసుకున్నారు. దరఖాస్తుదారులు మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలో ఉంటున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. నియోజక వర్గానికి వంద మందిని ఎంపిక చేసి వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తారని, దీంతో ఉపాధి కోసం యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. దళితబంధు పథకంలో ఎంపికైన వారికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షలతో కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అవసరమైన సాంకేతిక సహకారాన్ని జిల్లా అధికారులు ఇవ్వనున్నారు.
దళితులు ఆర్థికం గా అభివృద్ధి చెం దాలని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం అమలు చేస్తున్నారు. మొదటి దశలో నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.10 లక్షలు మంజూరు చేస్తుంది. వారు స్వయం ఉపాధి కోసం యూనిట్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేస్తాం.
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు