దుండిగల్, జనవరి 21: ప్రత్యేక కేసుల్లో ఇంటివద్దనే బాధితులకు ఎఫ్ఐఆర్ అందజేస్తామని ఇటీవల పోలీసుశాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన మాటను దుండిగల్ పోలీసులు అమలుచేశారు. దుండిగల్ పీఎస్ పరిధిలోని ఓ కుటుంబం సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి నగదు, నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన బాధితుడు డయల్ 100కు చేసిన ఫోన్‌కాల్‌తో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకున్నారు.
అదే సమయంలో బాధితుడి ఫిర్యాదు మేరకు అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని ప్రతిని అందజేశారు.రాష్ట్రంలోనే ఇదే మొదటిది కావడంతో దుండిగల్ పోలీసులను సైబరాబాద్ సీపీ అభినందించారు. సీఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం… విజయవాడకు చెందిన తుమ్మలపల్లి నాగేంద్రకృష్ణ చైతన్య దుండిగల్ సర్కిల్ పరిధి, గాగిళ్లాపూర్‌లో స్థిరపడ్డాడు. స్థానిక గ్రీన్వుడ్స్ విల్లాల్లో నివాసముంటున్నాడు. సంక్రాంతి పండుగకు ఇంటికి తాళంవేసి సొంతూరుకు వెళ్లారు. పండుగ తర్వాత మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చారు.
అయితే తమ ఇంటి వెనుక డోర్ పగులగొట్టి బీరువాలో దాచిన 10గ్రాముల బంగారం, 2కిలోల వెండి వస్తువులతోపాటు రూ.5వేల నగదు చోరీ చేసినట్లు గుర్తించి, వెంటనే ఆయన డయల్ 100కు కాల్ చేశారు. సమాచారం అందుకున్న దుండిగల్ సీఐ సతీష్, డీఐ బాల్‌రెడ్డి, ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదుతో అక్కడే కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ ప్రతిని అందజేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ని అమలు చేసిన కొన్ని గంటల్లోనే దుండిగల్ పోలీసులు అమలు చేయడంతో సైబరాబాద్ సీపీ డా. ఎం.రమేశ్.దుండిగల్ సీఐ సతీష్, సిబ్బందిని అభినందించారు.