మేడ్చల్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జీవో 59 ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలనను శనివారం (నేటి) నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ జీవో ద్వారా ఇండ్ల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా 41 మంది అధికారులను నియమించారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు సంబంధించి ఈ జీవో కింద 15,373 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. అయితే, ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీవోల ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో తొలుత 59 జీవో కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నారు. దరఖాస్తుల పరిశీలనలో జిల్లా స్థాయి అధికారులతోపాటు మండల స్థాయి అధికారులు స్వయంగా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు వెళ్లి పత్రాలను పరిశీలించిన అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో ఆ వివరాలను నమోదు చేస్తారు.
దరఖాస్తుల పరిశీలన అనంతరం రెవెన్యూ అధికారులు డిమాండ్ నోటీసులను జారీ చేయనున్నారు. ఇండ్ల క్రమబద్ధీకరణకు కావాల్సిన అన్ని అర్హతలు, అన్ని ఆధారాలు ఉన్నట్లయితే ఇంటి యజమానులకు డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన అనంతరం ప్రత్యేక కమిటీ క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరాలను డిమాండ్ నోటీసుల ద్వారా వివరిస్తారు. నోటీసుల ఆధారంగా చలాన్ రూపంలో డబ్బులు చెల్లించినట్లయితే ఇంటి క్రమబద్ధీకరణ చేస్తారు.
41 మంది ప్రత్యేక అధికారుల్లో ఒక్కొక్క అధికారి 600 దరఖాస్తులను పరిశీలించి యాప్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. త్వరితగతిన 59 జీవో ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి, ఆ తర్వాత 58 జీవోల దరఖాస్తులను పరిశీలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 15 రోజుల్లో 59 జీవో కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేకంగా నియామకమైన అధికారులకు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి దిశానిర్దేం చేశారు.