సిటీబ్యూరో, జూలై 6, (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్ లోపల కొత్త ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు అనుమతిస్తూ విడుదలైన జీవో 263కు సంబంధించిన మార్గదర్శకాలను రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ విడుదల చేశారు. ఈ నెల 6న కొత్త ఆటో రిక్షా రిజిస్ట్రేషన్ కోసం డీలర్ వద్ద నమోదు చేసుకునేందుకు కొత్త సాఫ్ట్వేర్ రూపకల్పన చేసి అందుబాటులోకి తెచ్చారు.
ఇందులో భాగంగా కొత్త ఆటో రిక్షా కొనుగోలు చేసేవారు రాష్ట్రం లో ఏ ఆటో రిక్షా డీలర్ వద్ద నైనా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం తమ 3 వీలర్ లైసెన్స్ , లైసెన్స్ పై ఉన్న అడ్రస్ తో పోలిన మరొక అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, కరెంట్ బిల్లు సమర్పించాలి. ఒకరికి ఒక ఆటో రిక్షా పర్మిషన్ మాత్రమే ఇస్తారు. ఇంతకు ముందు అతడి పేరుతో ఆటో రిక్షా ఉంటే వారు అనర్హులు. తన పేరు మీద ఇంకొక ఆటో రిక్షా లేదని ధ్రువీకరణ అఫిడవిట్‌ను కూడా డీలర్ కు సమర్పించాల్సి ఉంటుంది.