పీర్జాదిగూడ/ శంషాబాద్, జనవరి 14: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీ గోదా రంగనాథుల కల్యాణ మహోత్సం పలు ఆలయాల్లో శుక్రవారం నయనానందకరంగా జరిగింది. శుక్రవారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధి పర్వతాపూర్లోని శ్రీ స్వతంత్ర బ్రహ్మతంత్ర పరకాల మఠం, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవం బ్రాహ్మణులచే అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠంలో కొలువైన లక్ష్మీ హయగ్రీవ స్వామి, మహాలక్ష్మి మూలమూర్తులకు వేకువజామున నుంచి ప్రభాత సేవ, అభిషేకాలు తదితర నిత్య పూజలు నిర్వహించారు. కార్యక్రమాలకు మఠం సేవా సమితి సభ్యులు, ఆలయ అర్చకులు, కమిటీ ప్రతినిధులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
దివ్యసాకేత క్షేత్రంలో అత్యంత వైభవం..
శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలోని దివ్యసాకేత క్షేత్రంలో నిర్వహించిన ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా చివరిరోజు శ్రీశ్రీ గోదాదేవి ముగింపు ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చిన జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ధనుర్మాస మహోత్సవాలు జరిగాయి. అనంతరం శ్రీగోదారంగనాథుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య శాస్ర్తోక్తంగా జరిగింది. చిన జీయర్ స్వామి అనుగ్రహభాషణంలో ప్రసంగిస్తూ ధనుర్మాస ప్రాసస్త్యం, గోదాదేవి వివిష్టతలను తెలియజేశారు.
సాయిబాబాకు స్వర్ణ పుష్పార్చన
ఎల్బీనగర్, జనవరి 14: దక్షిణ షిర్డీగా బాసిల్లుతున్న దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలోని బాబాకు స్వర్ణ పుష్పార్చన మొదలయ్యింది. 108 స్వర్ణ పుష్పాలను తయారు చేయించిన ఆలయ కమిటీ ప్రతినిధులు బాబాకు అర్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు గంగాధర్, వైస్ చైర్మన్ వూర నర్సింహ గుప్త, ప్రధాన కార్యదర్శి ఈవీవీ నాగేశ్వర్ రావుతో పాటు సంస్థాన్ కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
పతంగి అలంకృత అయ్యప్ప ఆలయం
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేడ్చల్లోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని పతంగులతో వినూత్నంగా అలంకరించారు. గాలిలో ఎగిరే పతంగులు దేవాలయంలో అలంకరించడంతో ఆలయం అందంగా ముస్తాబు అయ్యింది.