సిటీబ్యూరో: కాంగ్రెస్ పాలనలో మాటలు కోటలు దాటుతాయి గానీ చేతలు గడప దాటవు అన్న చందంగా మారింది. హుస్సేన్ సాగర్ విస్తరించి ఉన్న బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ)ను రూ. వంద కోట్లతో అభివృద్ధి చేస్తామంటూ అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఆరు నెలలు గడిచినా.. ఈ ప్రాజెక్టు విషయంలో అడుగు ముందుకు పడలేదు. ట్యాంక్ బండ్ పరిసరాలను ఆధునీకరించి, వరల్డ్ క్లాస్ అర్బన్ రీక్రియేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇందుకు గ్లోబల్ ఏజెన్సీలను ఆహ్వానించిన హెచ్ఎండీఏ… ఇప్పటికీ ఒక్క ఇంచు కూడా పని మొదలుపెట్టలేదు.
ట్యాంక్ బండ్ సుందరీకరణ, వ్యూహాత్మక ప్రాజెక్టు లక్ష్యంగా హెచ్ఎండీఏ మార్చి నెలలో మాస్టర్ ప్లాన్, డిజైన్, డిటైల్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ కోసం టెండర్లను గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. బీపీపీని రీ డెవలప్ చేయడానికి ఏజెన్సీలను ఆహ్వానించి టెండర్లు కట్టబెట్టింది. అయితే ఆరు నెలలు గడిచినా ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ప్రభుత్వం ప్రతిపాదనల పేరిట హడావుడి చేస్తూ.. ప్రణాళికలను పట్టాలెక్కించడంలో జాప్యం చేస్తోంది.
ప్రతిపాదనలకే పరిమితం..
ట్యాంక్ బండ్ పరిసరాలను రీక్రియేషనల్ జోన్‌తోపాటు, మొబిలిటీ కారిడార్, ల్యాండ్ యూజ్ రీ డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ డిజైన్లు వంటి కీలకమైన అంశాలతో రూపొందించే బాధ్యతను ఏజెన్సీకి అప్పగించి, పనులు చేపట్టాలని నిర్ణయించారు. కానీ ప్రాజెక్టు మొదలు కాక ముందే, ప్రతిపాదనలు మూలన పడేలా చేశారు. ప్రాజెక్టు వల్ల పర్యాటక అభివృద్ధి జరుగుతుందని తెలిసినా ప్రతిపాదనలు కార్యరూపంలోకి తీసుకురావడం లేదు.