బంజారాహిల్స్, మార్చి 10 : ప్రపంచ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గ్లకోమా అవేర్నెస్ వాక్ నిర్వహించారు. సినీనటి నిహారిక కొణిదెల ఈ వాక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యుడు డా.సిద్దార్థ దీక్షిత్ మాట్లాడుతూ కంటి పీడనం పెరగడం వల్ల ఏర్పడే గ్లకోమాతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదన్నారు. 2040 నాటికి 76 మిలియన్ల నుంచి 111 మిలియన్లకు పెరగవచ్చని తెలిపారు. గ్లకోమాను ప్రారంభదశలో గుర్తించి చికిత్స అందించకపోతే కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ వాక్‌లో వైద్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా.ప్రశాంత్ గార్గ్, తదితరులు పాల్గొన్నారు.
గ్లకోమాపై అవేర్నెస్ సిటీబ్యూరో: హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి సంయుక్తంగా ఆదివారం గ్లకోమా అవేర్నెస్ సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ సైక్లిస్టులు రైడ్ చేస్తూ గ్లకోమాపై అవగాహన కల్పించారు. ఇలా వారంలో మూడు రోజులు అవగాహన కల్పిస్తున్నారు.