సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో భవనాలు, ఆస్తులను పక్కాగా లెక్కించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) సాంకేతికతతో సర్వే చేయనున్నారు. దేశంలోని అన్ని పట్టణాలు, నగరాలను మ్యాపింగ్ చేయాలన్న కేంద్ర సర్కారు ఆదేశాలతో.. ఐటీ విభాగం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆసక్తి ఉన్న సంస్థల నుంచి టెండర్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. అర్హత కలిగిన నియో జియో ఏజెన్సీకి సర్వే బాధ్యతలు అప్పగించింది. 18 నెలల పాటు సర్వే చేసి..రెండేండ్ల పాటు సదరు ఏజెన్సీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహించనున్నది. ఈ సర్వేలో గ్రేటర్లో అసలు నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి? వాటిలోని అంతస్తులు , ఎత్తు, విస్తీర్ణం, ఇతరత్రా వివరాలపై డిజిటల్ రికార్డులు రూపుదిద్దుకోనున్నాయి. ప్రతి భవనం సరిహద్దులను తెలుసుకునేందుకు సిటిజన్ సెంట్రిక్ సర్వీస్‌తో ఉపగ్రహ డేటా, డ్రోన్లను ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. సర్వే వివరాలను ఏ రోజుకు ఆ రోజు సంబంధిత సర్కిల్ అధికారులు సమాచారాన్ని చేరుస్తారు. మౌలిక సౌకర్యాల కల్పనకు నగరాభివృద్ధి ప్రణాళికలకు ఈ సమాచారం ఉపయోగపడనున్నదని అధికారులు తెలిపారు.
జీఐఎస్ ఆధారిత సర్వే ఇప్పటికే మహారాష్ట్రలోని బృహన్, ముంబై కార్పొరేషన్ అమలు చేస్తున్నది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి పనితీరును పరిశీలించి వచ్చి నగరంలో అమలుకు సిద్ధమయ్యారు. దాదాపు 20 లక్షల ఇండ్లను సర్వే చేయనున్నారు. ముఖ్యంగా ఇంటి నంబర్లు, వీధులు, కాలనీలను గుర్తించేలా సర్వే ఉంటుంది. ప్రతి ఇంటిని దగ్గర నుంచి చూసీనట్లు 3డీ పటాలుంటాయి. క్లిక్ చేస్తే.. నిర్మాణం , ఎన్ని అంతస్తుల్లో ఉన్నది? ఎంత విస్తీర్ణం వంటి వివరాలు తెలుస్తాయి. సమగ్ర డిజిటల్ పటాలతో ఆస్తిపన్ను ఎక్కువగా వసూలయ్యే ఇండ్లు, తక్కువగా చెల్లించేవి.. పన్ను పరిధిలో లేని కట్టడాలను గుర్తించవచ్చు. నివాస అనుమతుల భవనాల్లో వాణిజ్య కార్యకలాపాలున్నాయా అనేది తెలుసుకునే వీలుంటుంది. పన్ను విధింపులో అవకతవకలు వెలుగులోకి వస్తాయి.
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను పరిధిలోని భవనాలు 17 లక్షలకు పైగా ఉన్నాయి. ఏటా దాదాపు 20వేల వరకు కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆ మేరకు ఆస్తిపన్ను రావడం లేదు. ఏటా రూ. 1900 కోట్ల మేర ఆదాయం కష్టంగా రాబడుతున్నారు. వాస్తవానికి రూ. 2500 కోట్ల మేర రావాల్సి ఉన్నదని అంచనా. ఈ జీఐఎస్ సర్వేతో ఆస్తులు, భవనాల లెక్క పక్కాగా ఉంటుందని, తద్వారా జీహెచ్ఎంసీ రెవెన్యూ పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ సర్వేలో భాగంగా వరద నాలాలు, మురుగునీటి నాలాలు, రహదారులు, చెరువులు, తాగునీటి పైపులైన్లు, విద్యుత్, మురుగునీటి లైన్లు, అపార్ట్మెంట్లు, గృహాలు, వాణిజ్య సముదాయాలు, పార్కులు, పచ్చదనం, దవాఖానలు, ఖాళీ సంస్థలు, వంటి అనేక రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.