సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ) : ఉచిత పార్కింగ్‌కు తిలోదకాలిచ్చే మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నిర్ణయించారు. మొదటి 30 నిమిషాలు ఉచితంగా పార్కింగ్, ఆ తర్వాత 30 నిమిషాల నుంచి గంట వరకు షాపింగ్ చేసిన తర్వాత రసీదు చూపిస్తేనే ఫ్రీ పార్కింగ్ వెసులుబాటు ఉంటుంది. మూడు గంటలకు ఉంటే సంబంధిత మాల్ నిబంధనల ప్రకారం చార్జీలు వసూలు చేయాలి. ఇది ఉచిత పార్కింగ్ పాలసీ అమలు లక్ష్యం. కానీ చాలా చోట్ల మాల్స్, మల్టీప్లెక్స్‌లు వంటి వాణిజ్య సంస్థల్లో అడ్డగోలు పార్కింగ్ ఫీజులను వసూలు చేస్తున్నారు.
ఈ తరహా ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పకడ్బందీగా ఉచిత పార్కింగ్ పాలసీని అమలు చేసేందుకు సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే 30 సర్కిళ్లలో 30 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీంలో టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్, రెవెన్యూ సెక్షన్ నుంచి ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఈవీడీఎం నుంచి ఒకరు, ట్రాఫిక్ పోలీస్ నుంచి సీఐ, ఫుడ్ ఇన్స్పెక్టర్తో ఐదుగురు సభ్యులను ఏర్పాటు చేశారు.
ఈ టీం థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో పర్యటించి.. వాటర్ స్టాగ్నేషన్, ఫుడ్ కోర్టులో ఎలాంటి ఆహారం అందిస్తున్నారు. ఆ బిల్డింగ్‌కు ఫైర్ సెఫ్టీ పర్మిషన్ ఉందా? లేదా చెక్ చేయడంతో పాటు ఎన్ని గజాలకు అనుమతి తీసుకుని, ఎన్ని గజాలకు ట్యాక్స్ కడుతున్నారు? ఎంత ట్రేడ్ లైసెన్స్ కడుతున్నారు? అని పరిశీలించడమే కాకుండా ప్రతి మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ చేసే చోట ఎంత సేపటికి ఎంత పార్కింగ్ వసూలు చేస్తారు అని కూడా డిస్ప్లే చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే జరిమానా వేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీలో భారీ ఎత్తున బదిలీలకు రంగం సిద్ధమైంది. ఒకే చోట నాలుగేండ్లకు పైబడి అసిస్టెంట్ మొదలు, అడిషనల్ కమిషనర్ల వరకు అన్ని విభాగాలకు సంబంధించి పెద్ద ఎత్తున బదిలీలు చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బదిలీల్లో భాగంగా ఇప్పటికే టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎంటమాలజీ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు జీహెచ్ఎంసీ నుంచి ఇతర మున్సిపాలిటీలకు వెళ్లడం, అక్కడి నుంచి బల్దియాకు రిపోర్టు చేసేవారు. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర క్యాడర్ బదిలీలు పూర్తి అయిన వెంటనే జీహెచ్ఎంసీలో అంతర్గతంగా ఉద్యోగులకు ఒక చోట నుంచి మరో చోటకు స్థాన చలనం కల్పిస్తారు. ఈ మేరకు కమిషనర్ ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారు. వారం రోజుల వ్యవధిలో ఉద్యోగుల సమూల ప్రక్షాళన ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానంగా అవినీతి, ఆరోపణలు, సుదీర్ఘకాలం తిష్ట వేసిన ఉద్యోగులు బదిలీ కానున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పర్మినెంట్, ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తం కలిపి 26 నుంచి 28వేల మంది ఉంటారు. 18,500 వందల శానిటేషన్ వర్కర్లు, 950 సూపర్ వైజర్లు, 500 నుంచి 800 మంది ఆపరేటర్లు, 500 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, 400 మంది సూపరింటెండెంట్లు, సుమారు 100 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, 20 మంది జాయింట్ కమిషనర్లు, 20 మంది మెడికల్ ఆఫీసర్లు, 30 మంది డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. అయితే ఎక్కువగా బదిలీల్లో నాలుగేండ్లకు పైబడి ఒకే చోట కొనసాగుతుండడం, అవినీతి ఆరోపణలు, వివాదాస్పద అధికారులకు స్థానం చలనం ఉంటుంది.