హైదరాబాద్ : నగరంలో రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గాలులు కొనసాగుతాయని వెల్లడించింది. భారీ తీవ్రతతో వీచే గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రజలు అత్యవసర సమయాల్లో అవసరమైతేనే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది. గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున వర్షం కురిస్తే ఎవరూ చెట్ల కింద ఉండొద్దని చెప్పింది. అత్యవసర సమయాల్లో డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని ఈవీడీఎం తెలిపింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. గత ఐదు రోజులుగా నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.