సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ రూ.8,440 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను సోమవారం జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. కాగా గత స్టాండింగ్ కమిటీ సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం, బడ్జెట్ పారదర్శకంగా ఉండాలని సభ్యుల సూచనల మేరకు మార్పులు చేశారు.
రూ. 8340 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను.. సభ్యుల సూచనల మేరకు రూ. 100కోట్ల మేరకు పెంచి రూ.8440కోట్లు సవరణ బడ్జెట్‌గా ఆమోదించారు. పెంపులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టౌన్‌ప్లానింగ్ ఆదాయం రూ. 1,595.62కోట్లు అంచనా వేయగా, సవరణ బడ్జెట్లో దానిని రూ.938.96 కోట్లకు తగ్గించారు. మొదటి ఆరు నెలల్లో వచ్చిన ఆదాయం రూ. 425కోట్లు మాత్రమే. దీనిని బట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 900కోట్ల ఆదాయం సమకూరడం కష్టసాధ్యంగా మారింది.
ఈ పరిస్థితుల్లో ఏకంగా రూ. 1,201 కోట్ల ఆదాయం వస్తుందని రెవెన్యూ విభాగం అంచనా వేయడం గమనార్హం. ట్రేడ్ లైసెన్స్ ఆదాయం రూ. 92 కోట్ల నుంచి రూ.112 కోట్లకు పెంచి చూపించారు. కాగా వచ్చే ఏడాదిలో రూ.700 కోట్ల అప్పులు తీసుకురావాలని బడ్జెట్లో చూపించడం విశేషం. అయితే బడ్జెట్లో అభివృద్ధి పనులపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఎన్నికల ఏడాది బడ్జెట్‌పై సభ్యులు పెదవి విరిచినా మేయర్ మాత్రం ఆమోదించేందుకు మొగ్గు చూపడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోపు జనరల్ బాడి మీటింగ్‌లో సభ్యుల ముందు బడ్జెట్‌పై చర్చ పెట్టి ఆమోద ముద్ర పొందాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పుల అనంతరం ఫిబ్రవరి 20లోపు అంచనాలను మంజూరు చేయాల్సి ఉంటుందని చట్టం చెబుతున్నది. మార్చి 1లోపు కార్పొరేషన్ బడ్జెట్ అంచనాల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా కనబడుతుండటం గమనార్హం.
హెచ్ సిటీ ప్రాజెక్టులకు రూ.1237 కోట్లు, రహదారులకు రూ. 650 కోట్లు, సమగ్ర రోడ్డు నిర్వహణకు రూ.185కోట్లు, నాలాలు, డ్రైయిన్లు రూ.200కోట్లు పార్కులు, పచ్చదనంకు రూ. 208 కోట్లు, చెరువులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు రూ. 173 కోట్లు, అప్పులు రూ.1933కోట్లు, ఇంకుడు గుంతలకు రూ.72కోట్లు, ఇంజినీరింగ్ నిర్వహణ పనులకు రూ.314,హెల్త్ శానిటేషన్ విభాగానికి రూ.600కోట్లు కేటాయించారు. కాగా హౌజింగ్‌కు రూ.300కోట్లు కేటాయింపులు జరిపారు.