మన్సూరాబాద్, ఫిబ్రవరి 22: మన్సూరాబాద్ డివిజన్లో ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపిం చారు. ఫుట్‌పాత్, రోడ్లు ఆక్రమించి ఇష్టానుసారంగా అక్రమంగా వేసిన షెడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు చొరవ చూపారు. ఎల్బీనగర్ కామినేని చౌరస్తా నుంచి మన్సూరాబాద్ చౌరస్తా మీదుగా సహారా స్టేట్స్ కాలనీ సమీపం వరకు రోడ్డుకు ఇరువైపులా వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు.
రెండు జేసీబీల సహకారంతో శనివారం నుంచి సాయంత్రం వరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిపారు. జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్యామ్సన్ పర్యవేక్షణలో అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సుమారు 100కు పైగా ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు మాట్లాడుతూ.. రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రతాప్, టీపీఎస్ అక్బర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.