సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పౌరులపై జరిమానాల భారం మోపేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతుంది. స్వచ్ఛ కార్యక్రమాల అమలు ముసుగులో ఏ చిన్న ఉల్లంఘన జరిగిన పెనాల్టీలు వేసి ఖజానాను నింపుకునే పనిలో నిమగ్నమైంది. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారు.. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ కవర్ల వినియోగం, ఇష్టారాజ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలు వేసే తదితర ఉల్లంఘనులను గుర్తించి జీహెచ్ఎంసీ చలాన్లు విధిస్తూ వస్తున్నది.
మ్యాన్వల్ విధానంలో ఉన్న ఈ విధానాన్ని ట్రాఫిక్ పోలీస్‌ల మాదిరిగా ఈ-చలాన్లను విధించనున్నారు. ఈ మేరకు టాటా కన్సల్టెన్సీ సహకారంతో ఈ-చలాన్ల జారీకి సంబంధించి ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేశారు. ఈ వారంలో యాప్‌పై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చిన తర్వాత యాప్‌ను వినియోగంలోకి తెస్తామని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సీఎన్ రఘు ప్రసాద్ తెలిపారు. ఏ ఉల్లంఘనకు ఎంత పెనాల్టీ విధించాలో యాప్ ద్వారా ఆటోమేటిక్‌గానే జనరేట్ అవుతుందన్నారు. పెనాల్టీలను యూపీఐ ద్వారానే చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొత్తంగా ట్రాఫిక్ పోలీసుల తరహాలోనే ఏఎంఓహెచ్‌లు, డీఈఈలు, ఏసీపీలు తదితర అధికారులు ఈ-చలాన్ లు జారీ చేయనున్నారు. కాగా రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి ఈ ఏడాది మార్చి 3 వరకు రూ.2,33 లక్షల పెనాల్టీలు విధించారు.
4 నెలల్లో రూ.54.15 లక్షల జరిమానాలు
భవన నిర్మాణ వ్యర్థాల తరలింపులో భాగంగా నగరం నలువైపులా సీ అండ్ డీ (భవన నిర్మాణ) వ్యర్థాల శుద్ధికి 30 సర్కిళ్లలో నాలుగు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. జీడిమెట్ల, ఫతుల్లాగూడ రిసైక్లింగ్ ప్లాంట్ హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్, సోమ శ్రీనివాస్ రెడ్డి కంపెనీ శంషాబాద్, తూంకుంటలో రిసైక్లింగ్ ప్లాంట్‌కు తరలించి వ్యర్థాలను శుద్ది చేస్తున్నారు. మెట్రిక్ టన్నుకు రూ.419 నుంచి రూ.104ల వరకు ఛార్జి చేసి వ్యర్థాలను ప్లాంట్‌కు తీసుకువెళ్తున్నారు.
ఐతే ఈ తరలింపు ప్రక్రియలో సమన్వయ లోపంతో సజావుగా సాగడం లేదు. దీంతో భవన నిర్మాణ యాజమానులు ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన నెల రోజులుగా వ్యర్థాలను డంపింగ్ వేస్తున్న 1158 డెబ్రీస్ పాయింట్లను గుర్తించారు. తరచూ వేస్తున్న దాదాపు 762 పాయింట్లను గుర్తించి సంబంధిత డంపింగ్ చేస్తున్న వారికి జరిమానాలు విధించారు. ఈ నేపథ్యంలోనే 30 సర్కిళ్ల నుంచి గడిచిన నాలుగు నెలల వ్యవధిలో రూ.54.15 లక్షల మేర జరిమానాలు విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.