సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ.. ఆసియాలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్…రూ.వేల కోట్ల బడ్జెట్.. కానీ ఈ కార్పొరేషన్లో జరిగే పనులన్నీ ‘వింతే’ ! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఉన్నతాధికారుల పనితీరు చూస్తే పాలన గాడితప్పిందని అనక తప్పని పరిస్థితి.. సర్వీసులో లేని వారికి, ఏకంగా రిటైర్డ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చిన అధికారుల తీరుతో ప్రస్తుతం బల్దియా నవ్వులపాలవుతున్నది. సాధారణంగా ఉద్యోగి పదవి విరమణ పొందితే అధికారులు వీడ్కోలు సన్మానం చేసి.. వారికి రావాల్సిన బెనిఫిట్స్‌ను అందజేసి పంపిస్తారు..కానీ బల్దియాలో మాత్రం రిటైర్డ్ అయి ఇంట్లో ఉంటున్న ఉద్యోగులకు ‘బదిలీ’ కానుక ఇచ్చారు.
శాఖల వారీగా ఉద్యోగుల బదిలీల్లో భాగంగా 60 మంది ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల బదిలీలను జరిపారు. ఇందులో ఇద్దరు ఉద్యోగులు రిటైర్డ్ అయిన వారికి తిరిగి ఈ బదిలీల జాబితాలో పోస్టింగ్ ఇవ్వడం విశేషం. కుత్బుల్లాపూర్ సర్కిల్ 25లోని ఎం. శ్రీనివాస్‌రెడ్డి గతేడాది నవంబర్ 30న పదవీ విరమణ చేశారు. అయితే ఈ నెల 5న జరిపిన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల బదిలీలో జీడిమెట్లలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఉప్పల్ సర్కిల్ టీఐ సుదర్శన్ వీఆర్ఎస్ తీసుకున్నప్పటికీ తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఈ రెండు బదిలీల ప్రక్రియలో సంబంధిత అధికారులు చూపించిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు బదిలీల ప్రక్రియలో కనీసం సర్కిళ్ల వారీగా ఖాళీలను కూడా సరిచూసుకోకుండానే ఆర్డర్లు జారీ చేశారు. పాలనను చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తంగా తప్పుల తడకగా వచ్చిన ఉత్తర్వులను చూసి జీహెచ్ఎంసీ సిబ్బందే నవ్వుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.