శేరిలింగంపల్లి, మార్చి 8 : శేరిలింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్లోని అమీషా ఫుడ్ మేకింగ్‌పై జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సీజనల్ ప్రూట్స్ విక్రయించేందుకు జీహెచ్ఎంసీ అనుమతి పొంది నిబంధనలకు విరుద్ధంగా ఇథనాల్ రసాయనాలు వాడటంతో పాటు, పంది మాంసం విక్రయం, ఐస్‌క్రీమ్ ఇతర ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. షాపును సీజ్ చేయడంతో పాటు నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నల్లగండ్ల హుడా ట్రేడ్ సెంటర్లో యూపీకి చెందిన అస్మాన్ ఫెడ్రిక్ అమీషా ఫుడ్స్ మేకింగ్ పేరుతో పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇథనాల్ వాడుతూ పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారని స్థానికుల ద్వారా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన శేరిలింగంపల్లి సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ నగేశ్ నాయక్, వెటర్నరీ డాక్టర్ అబ్దుల్ వాసిద్ల నేతృత్వంలో జీహెచ్ఎంసీ అధికారుల బృందం బుధవారం మధ్యాహ్నం అమీషా ఫుడ్స్ మేకింగ్ సెంటర్‌పై దాడులు జరిపారు. మేకింగ్ సెంటర్లో నిర్వహిస్తున్న దందాను చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు.
పేరుకే పండ్ల వ్యాపారం… చేసేది పందిమాసం విక్రయం
సీజనల్ పండ్లు విక్రయించేందుకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొంది నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పండ్ల వ్యాపారానికి తోడు పంది మాంసం విక్రయం, ఐస్‌క్రీమ్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పెద్ద ఎత్తున బాటిళ్లు, డ్రమ్ముల్లో నిల్వచేసిన ఇథనాల్ రసాయనాలు, ఫ్రిజ్‌లో నిల్వచేసిన పంది మాంసంను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.
దేశ, విదేశాలకు సరఫరా
కవర్లలో ప్యాక్ చేసి ఆన్లైన్ కేంద్రంగా నగరంలోనే కాకుండా దేశ, విదేశాలకు పందిమాంసం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీలంక, అస్ట్రేలియా, జాంబియా దేశాలకు సరఫరా చేసినట్లు పలు అధారాలు సేకరించారు. నిర్వాహకుడు యూపీకి చెందిన అస్మాన్ ఫెడ్రిక్పై జీహెచ్ఎంసీ అధికారులకు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.