సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు గ్రేటర్ జనాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా నాలాలతో పాటు పురాతన భవనాల పరిసర ప్రాంతాల వాసులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనన్న భయం స్థానికుల్లో నెలకొంది. దీని కారణం జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పాలి. వాస్తవంగా మే నెలలో నాలా పూడితతీత పనులు పూర్తవ్వాలి.
కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం జూలై నెలాఖరు వచ్చిన నేటికి పనులు కొనసాగిస్తున్నారు. నిర్ధేశిత గడువులో రెండు నెలల అధికారుల నిర్లక్ష్యంతో గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ , శేరిలింగంపల్లి జోన్ పరిధిలో నాలా సమస్యలపై జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదులు వెలువెత్తుతుండడమే ఇందుకు నిదర్శనం.
నాలాల్లో పూడిక తీత పనులు పూర్తయితే వరద నీరు సాఫీగా వెళ్లి ముంపు సమస్యలు ఉండవు..పూర్తి కానీ చోట వరద ముంపు ప్రభావం పొంచి ఉండడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం పూడికతీత ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుందని, ఎగువ ప్రాంతాల నుంచి నాలాల్లోకి ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వచ్చి చేరుతాయని చెబుతుండడం గమనార్హం.
ఎందుకీ జాప్యం?
ప్రతి ఏడాది దాదాపు రూ.55 కోట్ల మేర నాలా పూడికతీత పనులకు టెండర్లు పిలిచి తొలకరి జల్లులు కురిసే నాటికల్లా పనులను పూర్తి చేసి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలి. కానీ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ నిర్వహణ విభాగం మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. గత డిసెంబర్ నెలలో నాలా పనులకు టెండర్లు ముగించాల్సిన అధికారులు మార్చి మొదటి వారం వరకు కొన్ని చోట్ల టెండర్లతోనే కాలాయాపన చేసింది. కానీ 94 శాతం కూడా పూర్తి చేసుకోకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.
ఈ ఏడాది రూ.55.04 కోట్లతో 203 చోట్ల పనులకుగానూ 951.71 కిలోమీటర్ల పొడవునా పూడికతీత చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు 886 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేయడం గమనార్హం. నేటికి వందశాతం పనులను పూర్తి చేయలేదు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వానాకాలంలో పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునుగుతున్నా జీహెచ్ఎంసీ గుణపాఠం నేర్వడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
అప్పట్లో కిర్లోస్కర్ కమిటీ స్టడీ చేసిన పలు సిఫారస్సులను కూడా అమలు చేయడంలో జీహెచ్ఎంసీ ఘోరంగా విఫలమవుతుందన్న విమర్శలున్నాయి. ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నా అప్పట్లో వరదల నివారణ కోసం కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తూ కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు తమ బినామీ సంస్థలకు పనులను అప్పగిస్తూ తుతూ మ త్రంగా చేపడుతూ ఏటా పూడిక పేరిట కోట్లాది రూపాయలు జేబులు నింపుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.