సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలం నేపథ్యం లో వచ్చే వరదలతో ప్రమాదాలు, వరద నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1302 కిలోమీటర్ల పొడువునా వరద కాలువ ఉన్నదని, ఇందులో 390 కిలోమీటర్ల మేర మేజర్ కాలువ ఉన్నట్లు తెలిపారు. వర్షాల సందర్భంలో గానీ, ఇతర సమయంలో ఆస్తి, ప్రాణ, జంతు నష్టం లేకుండా అప్రమత్తంగా ఉండేందుకు నాలా భద్రత చర్యలతో ఎంతగానో ప్రయోజనం ఉంటుందన్నారు.
ఇప్పటికే వరద నాలాల వెంబడి ఉన్న ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు తావు లేకుండా మెష్, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి జోన్లో గుర్తించిన ప్రమాద ఘంటికల వద్ద భద్రత చర్యలు తీసుకుంటామని, సర్కిల్ పరిధిలో ఒక నిర్వహణ విభాగం అసిస్టెంట్ ఇంజినీర్ అధికారికి కొన్ని కిలోమీటర్ల బాధ్యత అప్పగించినట్లు వివరించారు.