GHMC- Demolition | హైదరాబాద్లోని కాచిగూడ డివిజన్ నింబోలి అడ్డాలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ కట్టడంపై గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులు కొరడా ఝళిపించారు. కాచిగూడ డివిజన్లోని నింబోలిఅడ్డాలో దశరథయాదవ్ అనే వ్యక్తి 127 గజాల భూమిలో అనుమతులు లేకుండా నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు.
జీహెచ్ఎంసీ డీఎంసీ మారుతీ దివాకర్ ఆధ్వర్యంలో గురువారం కాచిగూడ పోలీసుల సహాకారంతో నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఈ సందర్బంగా డీఎంసీ మారుతీ దివాకర్ మాట్లాడుతూ సర్కిల్-6 పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న భవనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏసీపీ దేవేందర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.