సిటీబ్యూరో, జులై 24 ( నమస్తే తెలంగాణ) ; వర్షాలకు రోడ్లన్నీ జలమయం, ట్రాఫిక్ జాంలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు కేటీఆర్ ఫ్లెక్సీలు చింపివేయడంలో బిజీగా ఉండటంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వెలిసిన ఫ్లెక్సీలను గురువారం చింపివేశారు. ఫ్లెక్సీలను చించివేయడం ఏంటని నెటిజన్లు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులను ప్రశ్నించారు.
‘మీకు కేటీఆర్ ఫ్లెక్సీలే కనిపించాయా? కాంగ్రెస్, బీజేపీలవి కనిపించడం లేవా’ అంటూ నిలదీశారు. ‘కేటీఆర్ ఫ్లెక్సీలు చించివేసి.. ఆ ఆదేశాలిచ్చిన వారికి రాక్షసానందం కలిగించారా?’ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. కేటీఆర్ ఫ్లెక్సీని చించొచ్చేమో కానీ కేటీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ఏం చేయలేవంటూ రోహిత్ అనే నెటిజన్ పోస్ట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీకి హైడ్రా అధికారులు కూలీల్లా పనిచేస్తున్నారని మరో నెటిజన్ మండిపడ్డాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘ఎస్ఎన్డీపీ, ఫ్లైఓవర్స్, నాలెడ్జ్ సిటీ ఇలా ఎన్నో కేటీఆర్ సృష్టించాడని’ అంటూ పేర్కొన్నాడు. నిబంధనలు అందరికి ఒకేలా ఉండాలన్నారు.