ఏ పని కావాలన్నా.. ఏ విభాగంలో పనులు కావాలన్నా.. లంచం అనేది పరిపాటిగా మారింది. లంచం ఇస్తే ఫీల్డ్ విజిట్ చేయకుండానే నిర్మాణ అనుమతులు ఇచ్చేస్తున్నారు. లంచం ఇస్తే వేయని రోడ్లకు.. పూర్తికాని కాంట్రాక్ట్లకూ బిల్లులు సైతం ఇచ్చేస్తున్నారు. కొందరు అక్రమదారుల్లో బల్దియా నిధులను దోచుకుంటుంటే, మరికొందరు అధికారులు.. సక్రమంగా ఉన్న పనులకు బిల్లులు విడుదల చేయడానికి, పర్మిషన్లు ఇవ్వడానికి బిల్డర్ల వద్ద, కాంట్రాక్టర్ల వద్ద లంచం డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే.. ఫైల్ ముందుకు వెళ్లకుండా నెలల తరబడి నిలిపివేయడం.. వారి దరఖాస్తులో వివరాలు సరిగా లేవని తిప్పలు పెట్టడం అధికారులకు అలవాటుగా మారింది. ఒకటి రెండు విభాగాలను మినహాయిస్తే బల్దియాలోని ప్రతీ డిపార్ట్మెంట్లోనూ లంచం లేనిదే పని జరగదనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీలో ప్రతి పనికి ఇంతరేటు అని ఫిక్స్చేసి మరీ లంచాలకు మరిగిన ఉద్యోగుల తీరుపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ.. గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన పౌరసేలందించే శాఖ.. గ్రేటర్లో నివసించే ప్రజలందరికీ ఏదో ఒక రకంగా జీహెచ్ఎంసీతో అనుబంధం ఉంటుంది. పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ల నుంచి కాటికి వెళ్లిన వ్యక్తికి ఇచ్చే డెత్ సర్టిఫికెట్ వరకు ఏదో సందర్భంలో బల్దియా సేవలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఐతే ఎవరైనా సాధారణ పౌరుడు.. మధ్యవర్తి లేకుండా.. నేరుగా బల్దియా ఆఫీసులో ఏదైనా దరఖాస్తు చేసుకుంటే.. ఆ దరఖాస్తు పూర్తి అయ్యి పని పూర్తికావడం అంటే అసాధ్యమనే చెప్పాలి. అదే మధ్యవర్తి ద్వారానో లేక అధికారుల చేయి తడిపితే క్షణాల్లో పని పూర్తిచేసి సర్టిఫికెట్ నేరుగా చేతికి వచ్చేస్తుంది. భవన నిర్మాణ అనుమతులు, అక్యూపెన్సీ సర్టిఫికెట్ల జారీ మొదలు ఆస్తిపన్ను మదింపు, సవరణ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ఇలా ప్రతి పనికి ఇక్కడి అధికారులు ఒక రేటు ఫిక్స్ చేస్తారనే ఆరోపణలున్నాయి. విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన పనులకూ ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తూ బల్దియాకు మచ్చను తీసుకురావడంతో పాటు..లంచం తీసుకుంటూ వరుసగా ఏసీబీకి చిక్కుతున్నప్పటికీ వారి తీరులో ఎలాంటి మార్పు రావడంలేదు.
గ్రేటర్ పరిధిలో నిర్మాణ అనుమతులు ఇచ్చే టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమ వసూళ్ల దందా జోరుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడంలో, నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల విషయంలోనూ భారీగా లంచాలు వసూలు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఓ భవన నిర్మాణ అనుమతుల విషయంలో రూ.4 లక్షలు తీసుకుంటుండగా గతనెల 23న సికింద్రాబాద్‌కి చెందిన అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి విఠల్ రావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అంతకు కొద్దిరోజుల ముందు మే 3వ తేదీన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ్.. ఫైల్లో సంతకం చేయడానికి ఓ కాంట్రాక్టర్ దగ్గర రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇలా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. పన్ను సవరణ పేరుతో బిల్ కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసీలు ఇలా ఒకొకరుగా గడిచిన ఐదు నెలల్లో ఆరుగురు బల్దియా అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
మహిళా అధికారులు సైతం లంచం విషయంలో మేమేం తకువ కాదు అన్నట్లు పోటీ పడుతున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో లంచం తీసుకుంటూ నలుగురు బల్దియా అధికారులు ఏసీబీకి పట్టుబడగా.. అందులో ముగ్గురు మహిళా అధికారులు ఉండటం గమనార్హం. ఇందులో ఒకరు కాప్రా సరిల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వరూప.. చర్లపల్లికి చెందిన ఓ కాంట్రాక్టర్ పూర్తిచేసిన పనిని మెజర్మెంట్ బుక్(ఎంబీ)లో ఎంట్రీ చేసేందుకు రూ.లక్షా 20 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంబర్ పేట సరిల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా మరొక మహిళా అధికారి మనీషా.. కాంట్రాక్టర్ బిల్లును పై అధికారికి పంపడం కోసం రూ.20 వేలు డిమాండ్ చేయగా.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడింది. తాజాగా మూసాపేట సర్కిల్లో సీనియర్ అసిస్టెంట్ సునీత రూ. 30వేలతో ఏసీబీకి చిక్కారు. ఇలా బల్దియాలో అవినీతి పెచ్చుమీరపోయిందని.. ఉన్నతాధికారులు లంచాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.