సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్లో ప్రజల కనీస వసతులపై జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తున్నది. రోజురోజుకు జనాలకు కష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే సీఆర్ఎంపీ (సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం) నిర్వహణ గాలికి వదిలేసింది. ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలను పక్కనపెట్టి రహదారులన్నీ గుంతలమయం చేశారు. మరో వైపు పారిశుధ్యం అధ్వానంగా మారింది. జీవీపీ (తరచూ చెత్త వేసే ప్రాంతాలు) ఎత్తివేతలో విఫలమైంది. వీటన్నింటికీ తోడుగా వీధి లైట్ల సమస్య ప్రజలను మరింత ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవంగా వీధి లైట్లు చాలా చోట్ల వెలగడం లేదని, నిర్వహణ బాగులేదని సదరు ఈఈఎస్ఎల్ ఏజెన్సీపై మేయర్ నుంచి కమిషనర్, పాలకమండలి సభ్యులు సైతం ముక్తకంఠంతో వ్యతిరేకించారు.
కానీ నిర్వహణలో మాత్రం అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. సదరు ఏజెన్సీని గాడిలోకి తెచ్చుకోకపోగా…నూతన విధానాన్ని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ క్రమంలోనే సదరు ఏజెన్సీ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. వీధి లైట్ల నిర్వహణలో సదరు ఏజెన్సీ పనితీరు బాగులేదని ఏడాది కాలంగా ఫిర్యాదులు వస్తున్నప్పుడు అధికారులు ఏం చేయాలి? సదరు ఏజెన్సీతో పనిచేపిస్తూనే కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలి. అనుభవాలు పునరావృతం కాకుండా వీధి లైట్ల నిర్వహణను చేపట్టాలి. కానీ జీహెచ్ఎంసీ ఎలక్టిక్రల్ విభాగం అధికారులు.. సదరు ఏజెన్సీతోనే గడువు ముగిసే వరకు పనులు చేపడుతున్నారు.
కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపే వరకు మరో రెండు నెలల పాటు అవకాశమివ్వాలని ప్రస్తుతం ఉన్న ఈఈఎస్ఎల్ ఏజెన్సీని అభ్యర్థిస్తున్న అధికారుల పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు ఎలక్టిక్రల్ విభాగంలో అనేక లోపాలు ఉన్నాయి. వీధి లైట్ల నిర్వహణపై మూడు నెలల ముందే టెండర్లు పిలిచి కొత్త వారిని నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. అంతేకాదు ఈ విభాగంలో ఈఈ, డీఈల కొరవ వేధిస్తున్నది. విద్యుత్ శాఖ నుంచి కొత్త వారిని తీసుకోకపోగా…ఏండ్ల తరబడి డిప్యూటేషన్ వచ్చిన వారినే కొనసాగుతుండడంతో ఈ విభాగం నుంచి సరైన ఫలితాలు రావడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు.
గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వీధి దీపాలు లేక చీకట్లు అలుముకున్నాయి. ఐదు లక్షలకు పైగా ఉన్న వీధి దీపాల్లో దాదాపు 35 శాతానికి పైగా వీధి దీపాలు వెలగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో తరచూ స్ట్రీట్ లైట్లు వెలగక ఇబ్బందులు పడుతున్నామంటూ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. దీనిపై దృష్టి సారించిన కమిషనర్ ఇలంబర్తి.. సదరు నిర్వహణ బాధ్యతలు చూసే ఈఈఎస్ఎల్ ఏజెన్సీలో ఏ మాత్రం పనితీరు మెరుగుపర్చుకోవడం లేదని తీవ్ర స్థాయిలో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఈఎస్ఎల్ పనితీరులో మార్పు రాకపోవడంతో ఏకంగా రూ. 80కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులను కమిషనర్ నిలిపివేయడంలో నిర్వహణలోనూ ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
గ్రేటర్లో సుమారు 5.48 లక్షల వీధి దీపాలను నిర్వహించే బాధ్యతలను 2018 ఏప్రిల్ నుంచి ఏడేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)కు అప్పగించిన సంగతి తెలిసిందే. వీటిలో పది శాతం స్ట్రీట్ లైట్లు టైమర్ల సహాయంతో ఆటోమెటిక్‌గా వెలగడం, ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుండగా, మిగిలిన వాటన్నింటిని మ్యానువల్‌గానే నిర్వహిస్తున్నారు. అయితే నిర్వహణలో ఈఈఎస్ఎల్పై తరచూ కార్పొరేటర్లు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.
ఒకానొక దశలో గత కమిషనర్లు సైతం మందలించారు. ముఖ్యంగా వీధి దీపాల మరమ్మతుల పాలైనప్పుడు మార్చాల్సిన లైటు, ఇతర పరికరాలను ఎప్పటికీ సుమారు 15 శాతం రిజర్వ్ పెట్టుకోవాలన్న నిబంధన ఒప్పందంలో ఉన్నప్పటికీ దానిని ఈఈఎస్ఎల్ ఏ మాత్రం అమలు చేయకపోవడం, కొత్తగా పది కాలనీలకు విద్యుత్ సరఫరా మంజూరయినప్పటికీ స్తంభాలు వేసి, కరెంట్ తీగలను లాగడంతో పాటు వీధి దీపాలను బిగించాల్సిన ఈఈఎస్ఎల్ పట్టించుకోకపోవడం గమనార్హం.
సదరు ఏజెన్సీ నిర్వహణ బాగులేదని స్వయంగా కమిషనర్, మేయర్ సైతం అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా.. నిర్వహణలో ఏ మాత్రం మారలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరుతో సదరు ఏజెన్సీతో ఒప్పందం గడువు ముగియనున్నది. తర్వాత వీధి లైట్ల నిర్వహణను ఎవరు చూస్తారన్న దానిపై జీహెచ్ఎంసీ అదికారుల నుంచి సమాధానం రాకపోవడం గమనార్హం.