సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోందా? డిసెంబర్ నెలలో నాలా పనులకు టెండర్లు ముగించాల్సిన అధికారులు మార్చి ముగింపు వచ్చినా నేటికీ టెండర్ల దశలోనే కాలయాపన చేస్తోందా? చాలా చోట్ల పనులు ఇంకా మొదలు కాలేదా? ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తూతూ మంత్రంగా నాలా పూడికతీత పనులను ముగుస్తుందా? అంటే క్షేత్రస్థాయి పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
వాస్తవంగా జనవరి నుంచి మే నెలాఖరు వరకు పనులకు అనుకూల సమయం.. ప్రాజెక్టు అయినా, నాలా పనులైన యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయవచ్చు. కానీ ఘనత వహించిన బల్దియా ఇంజినీరింగ్ నిర్వహణ విభాగం నాలా పూడికతీత పనులను సకాలంలో చేపట్టి పూర్తి చేయాల్సిన చోట మూడు నెలలుగా టెండర్ల దశలోనే ఊగిసలాడుతున్నది. జోనల్ వారీగా కోటి రూపాయల పనులను 10 విభాగాలుగా విభజించిన అధికారులు గ్రౌండింగ్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో పనుల పారదర్శకతపై అనుమానాలు లేకపోలేదు.
ప్రతి ఏడాది దాదాపు రూ.60 కోట్ల మేర నాలా పూడికతీత పనులకు టెండర్లు పిలిచి తొలకరి జల్లులు కురిసే నాటికల్లా పూడికతీత పనులను పూర్తి చేసి వరదనీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలి. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ నిర్వహణ విభాగం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇప్పటికే చెల్లించాల్సిన1400 కోట్ల రూపాయలు అందకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు మొరాయిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జీహెచ్ఎంసీ పనులంటేనే కాంట్రాక్టర్లు హడలెత్తిపోయి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విభాగం సారథ్యంలో జరగాల్సిన నాలా పూడికతీత ఇప్పటివరకు చాలాచోట్ల ప్రారంభం కాలేదు. డిసెంబర్లో పనులకు టెండర్లు పిలిచి జనవరిలో ప్రారంభించి మే నెలాఖరు కల్లా పూర్తి చేయాల్సిన చోట.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీనికి తోడు ఎస్ఎన్డీపీ మొదటి దశను ఇంకా పూర్తి చేయలేకపోవడం ..పూడికతీత పనులు చేపట్టకపోవడంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.
జీహెచ్ఎంసీ పరిధిలో సుమారుగా 1302 కిలోమీటర్లు పొడవైన వరద నీటి కాలువలున్నాయి. వీటిలో పెద్ద నాలాల పొడవు 390 కిలోమీటర్లు. చిన్న నాలాలు 912 కిలోమీటర్ల పొడవున్నాయి. వరద నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు అవసరమైన మరమ్మతులకు, పునరుద్ధరణ పనులకు ప్రతి సంవత్సరం రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు.ఈ పనులు సకాలంలో జరిగితే ముంపు తీవ్రత అంతగా ఉండదు. కానీ వేర్వేరు కారణాలను సాకుగా చూపించి అధికారులు ఆలస్యం చేస్తుండడంతో నీటి ముంపు తప్పడం లేదు. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభం నాటికల్లా పూర్తి కావాల్సిన పనులను 80 శాతమే పూర్తి చేసి తొలకరి జల్లు నాటికి పూడికతీతను వర్షార్పణం చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే 2024 సంవత్సరంలో 3.12 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తీసి 81 శాతం పనులతో ముగించారు. రికార్డుల్లో మాత్రం ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ పనుల పారదర్శకతకు పాతర వేస్తుండడం గమనార్హం.