సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ప్రధాన రహదారులపై ప్రయాణం సాఫీగా సాగుతున్నట్లే.. ఇక మీదట పెద్ద పెద్ద కాలనీల్లోను ఎటువంటి ఇబ్బందులు లేకుండా జర్నీ సాగనున్నది. సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం(సీఆర్ఎంపీ) ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను మూడేండ్ల కిందట ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. తొలి విడత పూర్తిగా విజయవంతం కావడంతో రెండో విడతపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఈ మేరకు 450కిలోమీటర్ల మేర పనులను గుర్తించి రూ.700 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సీఆర్ఎంపీ ఫేజ్-2 కింద సిద్ధం చేసిన ఈ ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. కాగా సీఆర్ఎంపీ మొదటి దశలో 812కి.మీ మేర మూడు, నాలుగు, అంతకంటే ఎకువ లేన్ల రోడ్లను మూడేండ్ల కిందట జోన్ల వారీగా పలు సంస్థలకు అప్పగించారు. ఇందుకు రూ.1,839 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటి వరకు రూ.971.79 కోట్లు ఖర్చు చేసి 757 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ అద్భుత ఫలితాలనిచ్చింది. అంతేకాకుండా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే సీఆర్ఎంపీ మోడల్ వివరాలను తీసుకోగా.. ఛత్తీస్‌గఢ్ , రాజస్థాన్‌కు చెందిన పలు కార్పొరేషన్లు పురపాలక శాఖను సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే సీఆర్ఎంపీ రెండో దశకు అడుగులు పడ్డాయి. ఐదేండ్ల పాటు 450కి.మీ మేర రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, రోడ్డుకు సమానంగా మ్యాన్ హోళ్లు, క్యాచ్ పిట్ల ఎత్తు పెంచడం వంటి పనులకు రూ.700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రెండు, మూడు లేన్లుగా ఉన్న రహదారులను ఫేజ్ -2లో భాగంగా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.