సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : డెంగీ కేసులపై వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించిన ఆరోగ్యశాఖ డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. గడిచిన 3నెలల్లో 1082 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. డెంగీ నివారణ చర్యల్లో భాగంగా ప్రతి బస్తీ దవాఖానతో పాటు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా దవాఖానలు, గాంధీ, ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో చికిత్సను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
24 హాట్స్పాట్లు గుర్తింపు
నగరంలో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్న 24హాట్ స్పాట్లను గుర్తించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గోల్కొండ సర్కిల్లో ఎక్కువగా కేసులు నమోదవుతుండడంతో అక్కడ ప్రత్యేక హెల్త్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ పరంగా ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించడం, జ్వర సర్వేతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి దోమల నివారణకు యాంటి లార్వా, ఫాగింగ్ వంటి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
284ప్రత్యేక వైద్య శిబిరాలు
నగరంలోని డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో 384 ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో జూలై 12నుంచి ఇప్పటి వరకు దాదాపు 150కి పైగా హెల్త్ క్యాంప్‌లను నిర్వహించామని మిగిలిన క్యాంపులను కేసుల ఆధారంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ప్రతి గురు, శనివారం క్యాంపులు
ప్రతి గురు, శనివారం ప్రత్యేకంగా డెంగీ ప్రభావిత ప్రాంతాలతో పాటు వాటి పరిసరాల్లో ప్రత్యేక హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు నగర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గడిచిన మూడు నెలల్లో 10వేల మందికి పైగా జ్వర సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా డెంగీ కేసు నమోదైనట్లు తెలిస్తే వెంటనే ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంప్‌తో పాటు జ్వర సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బస్తీ దవాఖానల్లో సైతం పరీక్షలు
డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలకు సంబంధించిన వైద్య పరీక్షలను అన్ని బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి వెల్లడించారు. బస్తీ, పీహెచ్సీలలో పూర్తిస్థాయి వైద్యం అందుబాటులో ఉందని, రోగి పరిస్థితి తీవ్రంగా ఉండి, దవాఖానలో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే గాంధీ, ఉస్మానియా లేదా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌కు రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు.
నగరంలో డెంగీ కేసుల వివరాలు
జూలై : 384
ఆగస్టు : 711
సెప్టెంబర్ 6వరకు : 87