సిటీబ్యూరో, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. 987 పారులు, 700 ట్రీ పారులు, యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ డెవలప్ మెంట్, రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, ప్రజలకు ఉచితంగా మొకల పంపిణీ, 119 అర్బన్ పారెస్ట్‌లను అభివృద్ధి చేయగా హైదరాబాద్‌కు ‘ట్రీ సీటీ ఆఫ్ ద వరల్డ్’గా గుర్తింపు వచ్చిందని ఆమె అన్నారు. శుక్రవారం అర్బన్ గ్రీనరీ, హెల్దీయర్, హ్యాపీయర్ ప్లేసెస్ అంశంపై ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఏసియా, పసిఫిక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మూడవ ఏసియా – పసిఫిక్ అర్బన్ ఫారెస్ట్రీ సమావేశంలో గూగుల్‌మీట్ ద్వారా మేయర్ పాల్గొన్నారు. దేశం నుంచి హైదరాబాద్ మేయర్ మాత్రమే ఈ ఆన్ లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 119 అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్‌లను అభివృద్ధి చేశామన్నారు.
185 చెరువులు, కుంటల్లోని బఫర్ జోన్లో మొక్కలు నాటాలని ప్రతిపాదించామన్నారు. ఇప్పటి వరకు 42 చెరువుల వద్ద మొక్కలు నాటి సుందరీకరణ పనులు చేపట్టాని తెలిపారు. హరితహారం ద్వారా తెలంగాణలో అడవుల శాతాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచే సంకల్పంతో పని చేస్తున్నామని అన్నారు. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల కోసం ప్రత్యేక గ్రీనరీ బడ్జెట్ రూపొందించామని, స్థానిక సంస్థలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులలో పదిశాతం నిధులను గ్రీనరీ కోసమే వినియోగించుకునేలా చట్టం చేశామన్నారు. హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ గా గుర్తింపు పొందడం హర్షనీయమని, అంతర్జాతీయంగా ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ఏసియా పసిఫిక్ ప్రతినిధులు అన్నారు. త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాలు గ్రీనరీపై చేపట్టిన చర్యలను వివరించారు.