NBT Nagar | బంజారాహిల్స్, జూన్ 21 : బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీ నగర్లో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. శనివారం ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.1.16 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాన్ని మేయర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం కేవలం 200 మంది విద్యార్థులతో ఉన్న ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాలను అంచలంచెలుగా అభివృద్ది చేసుకుంటూ ప్రస్తుతం 1100 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా తీర్చిదిద్దామన్నారు. కొత్తగా నిర్మించిన భవనంలో అదనపు తరగతి గదులతో పాటు లైబ్రరీ, సైన్స్లాబ్, డైనింగ్‌హాల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు ఇంటర్మీడియట్ కోసం వేరేప్రాంతాలకు వెళ్లకుండా ఎన్బీటీ నగర్లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. దీని కోసం స్థలం సిద్దంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, డిప్యుటీ ఈవో శామ్యూల్రాజుతో పాటు అద్యాపకులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, మహిళా సమాఖ్యల సభ్యులు పాల్గొన్నారు.