సిటీబ్యూరో: ‘కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యత లేని నాన్‌వెజ్ విక్రయాలు జరుపుతూ చికెన్ మార్కెట్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. భరించలేని దుర్వాసన, ఎలుకల సంచారం.. తక్షణమే చికెన్ మార్కెట్‌ను సీజ్ చేయండి’.. ఈ నెల 22న కోఠిలోని మోతీ మార్కెట్లో ఆకస్మిక పర్యటన సందర్భంగా మేయర్ అధికారులకు చేసిన ఆదేశాలివి.. మేయర్ ఆదేశాల మేరకు చికెన్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి సీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇది గడిచి 24 గంటలు గడవక ముందే ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ సీజ్ చేసిన చికెన్, మటన్ షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ మందలించారు. మేయర్ ఆదేశాలు డోంట్‌కేర్..ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని సీజ్ చేసుకుంటామా? అంటూ ఎమ్మెల్సీ బేగ్ మేయర్ తనిఖీల తీరును ఎండగట్టారు. ప్రస్తుతం యధేచ్ఛగా మోతీ మార్కెట్లో చికెన్ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది. మేయర్ తీరుపై ఎంఐఎం ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడి క్యాంటీన్ విషయంలోనూ మేయర్ తరచూ జోక్యం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్సీ బేగ్ మేయర్ ఆదేశాలకు ధీటుగా నిలబడి విమర్శలు గుప్పిస్తుండడంపై అటు అధికారుల్లో, ఇటు కార్పొరేటర్లలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
తనిఖీల వెనుక ఆంతర్యమేమిటీ
ఇటీవల కాలంలో మేయర్ తనిఖీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అటు జీహెచ్ఎంసీ కార్యాలయంలో, ఇటు పలు జోన్ల పర్యటనలలో ఆకస్మిక పర్యటనలు టార్గెట్‌గా జరుగుతున్నాయని చర్చ మొదలైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విభాగాల వారీగా ఆకస్మిక పర్యటనలు చేసి సమయానికి విధులు హాజరు కావడం లేదని సిబ్బందిపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫీల్డ్ తనిఖీలు ఉంటాయని, మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటారు. కానీ మేయర్ ఈ విషయం తెలిసినా.. సెలక్టెడ్ అధికారులే టార్గెట్‌గా మందలించడంపై పలువురు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆహార నాణ్యత నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు అధికార పార్టీ, ఇటు ఎంఐఎం పార్టీల్లో హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్లో మేయర్ హల్ చేశారు. ఓ కార్పొరేటర్, మరో ఎంపీకి చెందిన హోటళ్లలో పర్యటించడం వెనుక అంతర్యమేమిటన్న ప్రశ్నలు వినిపించాయి. మోతీ మార్కెట్లోని చికెన్ సెంటర్లో తనిఖీ చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో వ్యాపారం జరుగుతున్నదని, ఎలుకలు సంచరిస్తున్నాయని గుర్తించి అధికారులకు చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించడం, ఎంఐఎం ఎమ్మెల్సీ మేయర్ ఆదేశాలు డోంట్‌కేర్ అంటూ వ్యాపారాలను తిరిగి యధేచ్ఛగా చేసుకునేలా చేయడం చర్చనీయాంశమైంది.
ప్రొటోకాల్ ఉల్లంఘనను అరికట్టండి
మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలువురు కార్పొరేటర్లు కలిసి ప్రొటోకాల్ ఉల్లంఘన అరికట్టాలని విన్నవించారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రతి అభివృద్ధి పని ప్రారంభోత్సవంలో అధికారులు ప్రొటోకాల్‌కు విరుద్దంగా జరుపుతున్నారని మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్‌కు వివరించారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం తెలియకుండా పనులు మొదలు పెడుతున్నారని, అధికార పార్టీ నాయకుల అండతో అధికారులు పనిచేస్తున్నారని, ఈ విషయాన్ని అధికారులు బాహాటంగానే రాజకీయ ఒత్తిడి ఉందని ఒప్పుకుంటున్నారని కార్పొరేటర్లు తెలిపారు. సదరు అధికారులపై శాఖపరమైన, క్రమశిక్షణ చర్యలు మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 153, 154, 155 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ మేరకు మేయర్‌కు కార్పొరేటర్లు వినతిపత్రం సమర్పించారు.