సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని, సీజ్ చేసిన దుకాణదారులను రక్షించడం తగదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన చికెన్ సెంటర్ నిర్వాహకులకు అండగా నిలబడి, అధికారులపై బెదిరింపులకు దిగిన ఎంఐఎం నేతల తీరుపై మేయర్ ఘాటుగా స్పందించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఎవరూ అడ్డు తగిలినా సహించబోనని తేల్చి చెప్పారు. ఆహార నాణ్యత ప్రమాణాలు వ్యాపారస్తులు పాటించాల్సిందేనని, ఆరోగ్య భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్పష్టం చేశారు.
గోషామహల్ నియోజకవర్గంలోని చాదర్‌ఘాట్‌లో జీహెచ్ఎంసీకి సంబంధించిన అజాద్(మోతి)మార్కెట్లో ఈ నెల 22న మేయర్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేసి, కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యత లేని నాన్‌వెజ్ విక్రయాలు జరుపుతున్న రెండు చికెన్ షాపులను తక్షణమే సీజ్ చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ బేగ్, కొందరు వార్డు మెంబర్లు అక్కడకు చేరుకుని జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించారు. సీజ్ చేసి తీసుకువెళ్లిన చికెన్‌ను బలవంతంగా తీసుకొచ్చారు. తిరిగి 24 గంటల వ్యవధిలోనే షాపులను తెరిపించి యథేచ్ఛగా వ్యాపారం సాగేలా చేశారు.
ఈ విషయంలో మేయర్ ఆదేశాలు డోంట్‌కేర్..ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని సీజ్ చేసుకుంటామా? అంటూ ఎమ్మెల్సీ బేగ్ మేయర్ తనిఖీల తీరును ఎండగట్టారు. ఈ అంశం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్‌గా మారడం, ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన మేయర్, వెటర్నరీ విభాగం ముఖ్య అధికారి వకీల్, ఇతర అధికారులపై తీవ్ర స్థాయిలో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టేట్ విభాగం అధికారులను సైతం మందలించారు. రంగంలోకి దిగిన అధికారులు మేయర్ ఆదేశాల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ రెండు చికెన్ షాపులను సీజ్ చేయడమే కాదు… వాటి గడువు ముగిసినా కొనసాగుతున్న లీజును రద్దు చేసి తిరిగి టెండర్లు పిలవాలని అదనపు కమిషనర్ ఎస్టేట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ బేగ్ మధ్య జరుగుతున్న పరిణామం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
Chiken Market
అసలేం జరిగిందంటే.?
సర్కిల్-14 డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్, వెటర్నరీ ఆఫీసర్ అధికారుల బృందం రషీద్ హుస్సేన్ (స్టాల్ నం.3), కలీమ్ హుస్సేన్‌లు (స్టాల్ నం.42) నిర్వహిస్తున్న చికెన్ షాపులపై గత శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 1600 కంటే ఎక్కువ బ్రాయిలర్ కోళ్లు, 30 కిలోల డ్రెస్డ్ చికెన్, 7 కిలోల లివర్‌ను కనుగొన్నారు. ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా వెటర్నరీ విభాగం సంబంధిత చికెన్, లివర్‌ను స్వాధీనం చేసుకొని.. బ్రాయిలర్ పక్షుల(కోళ్లు)ను రెండు గంటల లోపు తీసుకువెళ్లాలని ఆయా షాపుల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన జరిగిన కొంత సమయం తర్వాత మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ బేగ్, కొందరు వార్డు మెంబర్లు అక్కడకు చేరుకుని జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించారు. సీజ్ చేసి తీసుకువెళ్లిన చికెన్‌ను బలవంతంగా తీసుకువెళ్లారు. ఈ ఘటనపై గోషామహల్ సర్కిల్ వెటర్నరీ ఆఫీసర్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ రెండు షాపులు సీజ్, లీజు రద్దు..
గతంలోనూ ఈ షాపుల యాజమానులకు పబ్లిక్ హెల్త్ నార్మ్స్ ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేశారని, జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 521, 622, 487, 596 కింద షాపులు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు షాపుల యాజమానులు ఆ నోటీసులు స్వీకరించకుండా తిరస్కరించడంతో వాటిని గోడపై అతికించడంతో పాటు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించామని ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. అంతేకాకుండా అజాద్(మోతి) మార్కెట్ లీజుల గడువు ముగిసిందని, తిరిగి ఆన్లైన్లో టెండర్ల ద్వారా ఈ రెండు షాపులను తిరిగి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం.
ఒక్క పర్యటన..ఎన్నో లోపాలు..
ఒక్క పర్యటన.. ఎన్నో లోపాలు.. ఘనత వహించిన అధికారులు ఏం చేస్తున్నారు? వారీ లోపాలు స్పష్టంగా వెలుగులోకి వచ్చిన వారిపై చర్యలు ఏవీ? ఇంతకు జీహెచ్ఎంసీ దుకాణాల లీజు గడువు ముగిసినా వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఎస్టేట్ విభాగం విఫలమైంది? జీహెచ్ఎంసీ ఆదాయ రాబడిలో కీలకమైన అద్దెదారుల విషయంలో ముఖ్య అధికారులు ఏం చేస్తున్నారు అంటే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబర్తి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నాణ్యత ప్రమాణాలు పట్టించుకోకుండా, అపరిశుభ్రమైన వాతావరణంలో వ్యాపారం చేస్తున్న వారి పట్ల వెటర్నరీ, ఏఎంఓహెచ్ఓలు ఏం చేస్తున్నారు? మేయర్ తనిఖీ తర్వాత బాధ్యులైన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దుకాణదారులపై చర్యలు తీసుకున్నట్లే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది.
చట్టానికి ఎవరూ అతీతులు కాదు..
దుకాణదారులను రక్షించేవారికి మేయర్ విజయలక్ష్మి హెచ్చరిక చేశారు. ప్రజలు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాల భద్రత, నాణ్యతను కాపాడే ఉద్దేశంతో రెగ్యులర్‌గా హోటల్స్, రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 22న చాదర్‌ఘాట్‌లోని అజాద్ మార్కెట్లో తాను అకస్మికంగా తనిఖీలు చేపట్టగా, రెండు డ్రెస్డ్ చికెన్ షాపులు అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహణ ఉందని, అక్కడ ఎలుకలు తిరుగుతున్నాయని గమనించామని మేయర్ వివరించారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు అట్టి షాపులను మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
ప్రజారోగ్య పరిరక్షణ జీహెచ్ఎంసీ ప్రాథమిక బాధ్యత అని, అజాద్ మార్కెట్లో ఉన్న అనారోగ్యకర పరిస్థితులు ఎలుకలు తిరుగుతూ ఉండటం, దుర్వాసన వెదజల్లడం, శుభ్రత లేకపోవడం వంటి ప్రజా ఆర్యోగానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్న దృష్ట్యా ఇలాంటి చర్యలు తీసుకోవడం అత్యవసరమైందని మేయర్ తెలిపారు. జీహెచ్ఎంసీలోని అన్ని వ్యాపార స్థావరాలు, షాపుల యాజమానులు శుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఆరోగ్య భద్రతకు సహకరించాలని మేయర్ కోరారు. ప్రజల ఆరోగ్యం కోసం జీహెచ్ఎంసీ ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని మేయర్ పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, సీజ్ చేసిన దుకాణదారులను రక్షించడం తగదని ఈ సందర్భంగా ఎంఐఎం నేతలకు మేయర్ హెచ్చరించడం గమనార్హం.