సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం పనితీరుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు హౌస్ కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పారిశుధ్యం నిర్వహణలో లోపాలను ఎత్తిచూపేందుకు, ప్రకటనల విభాగంలో అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు కౌన్సిల్ వేదికగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నీ పార్టీల కార్పొరేటర్లతో కలిసి రెండు వేర్వేరు హౌస్ కమిటీలు వేశారు. ఇందులో భాగంగానే బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుధ్యం ప్రకటనల విభాగంపై ఏర్పడిన కమిటీ సమావేశాలు రెండు వేర్వేరుగా మేయర్ అధ్యక్షతన జరిగాయి.
పారిశుధ్యంపై హౌస్ కమిటీ సభ్యులు ఇచ్చిన ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడంతో వచ్చే 15 రోజుల్లోగా సమాధానాలతో వచ్చే సమావేశానికి రావాలని మేయర్ సూచించారు. ఇదే సమయంలో ప్రకటనల విభాగంపై హౌస్ కమిటీ సభ్యులు చర్చించాలనుకునే సమయానికి బాధ్యులైన ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో మేయర్ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రకటన విభాగం అడహక్ కమిటీ బాధ్యులు ఏఎంసీకి కమిషనర్ ఇచ్చారని సదరు డైరెక్టర్ మేయర్‌కు వివరించారు. దీంతో కమిటీ సభ్యులు ప్రకటనల విభాగంలో జరుగుతున్న తంతుపై మరోసారి విరుచుకుపడ్డారు.
కౌన్సిల్లో హౌస్ కమిటీ ఏర్పడిన తర్వాత ఏకపక్షంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.కార్తిక్‌పై ఎలాంటి విచారణ లేకుండా బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. విచారణాధికారి ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించలేదని మండిపడ్డారు. కమిటీ విచారణలోకి రాకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ప్రకటనల బోర్డులు, హోర్డింగ్‌లను ఎందుకు తీయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 15 రోజుల్లో కమిటీ సభ్యులు ఇచ్చిన ప్రతి ప్రశ్నకు సమాధానాలతో అధికారులు రావాలని మేయర్ ఆదేశించారు.