సిటీబ్యూరో, జనవరి 21(నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శోభన్ రెడ్డిలపై అవిశ్వాస కత్తి వేలాడుతున్నదా? బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వీరిపై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నదా? ఇందులో భాగంగానే మంగళవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చకు రావడంతో అటు రాజకీయ వర్గాలు, ఇటు కార్పొరేటర్లలో విస్తృత చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన విజయలక్ష్మి, మోతె శ్రీలతకు మేయర్ , డిప్యూటీ మేయర్ పదవులు వరించాయి.
అప్పట్లో ఎంఐఎం బీఆర్ఎస్కు అండగా నిలిచింది. ఏడాదికి పైగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్లపై తీరుపై అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గత కొంతకాలంగా ఆసంతృప్తితో ఉన్నారు. ఏడాదిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవిశ్వాసం తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం పాలక మండలి పదవీ బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికలు 2020 డిసెంబరులో జరిగినప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్లు 2021 ఫిబ్రవరి 11వ తేదీన బాధ్యతలు చేపట్టారు.
వచ్చే నెల 10వ తేదీతో వారి నాలుగేళ్ల కాలం పూర్తవుతున్నందున ఆది ముగియగానే అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు సిద్దమవుతుండడం, ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ సైతం వారి పదవులను తప్పించాలనే ఎత్తు గడకు సన్నద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సగం మంది నిర్ణీత ప్రొఫార్మాలో తీర్మానం చేసి సంతకాలు పెట్టి జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి.
జీహెచ్ఎంసీలో 150 డివిజన్లకుగానూ 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇద్దరు కార్పొరేటర్లు (ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్) అనారోగ్యంతో చనిపోగా, మరో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా మెహిదీపట్నం, బహదూర్‌పుర నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 146 మంది కార్పొరేటర్లకు 50 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు వెరసి మొత్తం 196 మంది సభ్యులు సంతకాలు అవసరం. ఇందులో దాదాపు 2/3 మెజార్టీ ఉంటే అవిశ్వాసం నెగ్గుతుంది. అంటే దాదాపు 131 మంది సంతకాలు అవసరం ఉంటాయి. కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియోలతో కలిసి 60 మందితో బలంగా ఉన్న బీఆర్ఎస్, అవిశ్వాస తీర్మానం పెట్టి ఎలాంటి వ్యూహం ఆచరిస్తుందని అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.