సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ) : అనధికారిక నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ -455ఏ ప్రకారం తమ ఇంటిని క్రమబద్ధ్దీకరించాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న వారీ సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ క్రమబద్ధీకరణ అంశం కమిషనర్ స్థాయి నుంచి ఆమోద ముద్ర పొందడంలో జాప్యం జరుగుతుండడంతో నిబంధనలను సవరించాలని నిర్ణయించారు.
ఈ మేరకు కమిషనర్ నుంచి అధికారాన్ని జోనల్ కమిషనర్లకు బదిలీ చేస్తూ ప్లానింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కాగా, గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి సవరణ ప్రతిపాదనను ఆమోదించనున్నారు.