వార్షిక బడ్జెట్‌పై బల్దియా మల్లగుల్లాలు పడుతున్నది. రాబోయే ఏడాది (2026-27)కు సంబంధించిన బడ్జెట్‌పై అధికారుల కసరత్తు కొలికి వచ్చిన సమయానికి గ్రేటర్ బయట, ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడం.. 150 వార్డులున్న జీహెచ్ఎంసీ 300 వార్డులుగా పునర్విభజన చేయడంతో జీహెచ్ఎంసీ విస్తరణ వైశాల్యం 2053 చదరపు కిలోమీటర్లకు చేరింది. వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో విలీనమైన పురపాలకలను కలుపుకొని మొత్తంగా బడ్జెట్ రూపకల్పన అనివార్యమైంది. దీంతో బడ్జెట్ ముసాయిదాను తయారు చేసే క్రమంలో విలీనమైన యూఎల్బీల వద్ద ఉన్న సమాచారం, బడ్జెట్ అంచనాలను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా..విలీన అంశం జాప్యానికి కారణమైంది.
-సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ )
ఈ ఏడాది వార్షిక బడ్జెట్ అంచనాలు దాదాపు రూ.12వేల కోట్లు వరకు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో విలీన పురపాలికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంచనాలు రూ. 12 వేల కోట్ల మారును దాటే అవకాశాలు బలంగా కనిపిస్తున్నట్టు పాలక వర్గాల్లోని చర్చ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ రిసీట్స్ రూ.4,445 కోట్లుగా ఉంటే ఈ ఏడాది 5,550 కోట్లుగా ఉండొచ్చని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.4,000 కోట్లుగా ప్రస్తుతముంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ వ్యయం రూ.5500 కోట్లుగా పెరుగుతుంది.
హెచ్సిటీ ప్రాజెక్టులు కార్యరూపంలోకి రానున్నాయి. ఎస్ఆర్డీపీ, నాలాల మాస్టర్‌ప్లాన్, సీఆర్ఎంపీ, వీధి దీపాల నిర్వహణలకు కేటాయింపులు జరుపనున్నారు. కాగా 2024-25లో బడ్జెట్ అంచనాలు రూ. 7,937 కోట్లుగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు రూ. 8,440 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ రెండు బడ్జెట్ల వ్యత్యాసం రూ. 503 కోట్లుగానే ఉంది. అయితే, వచ్చే వార్షిక బడ్జెట్ అంచనాలు రూ.12 వేలకు కోట్లకు పైగా ప్రతిపాదించే అవకాశాలున్నట్టు పాలక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మార్పు రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్లోనూ గ్రేటర్ కేటాయింపులు పెరుగుతాయని, రెవెన్యూ రిసీట్స్ ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్, ఎస్టేట్, పారుల ఆదాయాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్టు అధికారుల్లో చర్చ జరుగుతున్నది.
మరింత ఆలస్యం
జీహెచ్ఎంసీ చట్టం-1955 సెక్షన్ 182 ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ అంచనాల నివేదికను ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు తీసుకురావాల్సిన ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తాజాగా విలీనం, వికేంద్రీకరణ అంశం తెరపైకి రావడంతో ఆలస్యం చేశారు. స్టాండింగ్ కమిటీ సవరింపుల అంచనాల ప్రతిపాదనలు వాస్తవంగా ఈ నెల 10వ తేదీలోపు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ఆమోదం పొందిన వార్షిక బడ్జెట్ అంచనాల ప్రతిపాదనల బుక్లెట్స్ ప్రతి కార్పొరేటర్‌కి డిసెంబర్ 15 లోపు అందజేయాల్సి ఉంది. డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 20 లోపు జీహెచ్ఎంసీ ఆమోదించాల్సి ఉంది. కానీ జీహెచ్ఎంసీ 300 వార్డుల వరకు విస్తరించడంతో బడ్జెట్ అంచనాపై కసరత్తు కొనసాగుతున్నది. వచ్చే ఏడాది మార్చి 1 లోపు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉందని చట్టంలో పేర్కొన్నది. అయితే ప్రస్తుత పాలకమండలి గడువు ముగిసే లోపు బడ్జెట్ ఆమోద ముద్ర వేసుకొని, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.