GHMC | సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనతో జీహెచ్ఎంసీ సిద్ధమైంది. హౌసింగ్‌తో కలుపుకొని ఈ సారి రూ. 8,600 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30న ఈ బడ్జెట్ ప్రతిపాదనపై మేయర్ అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. కాగా, 2024-25 బడ్జెట్ రూ. 7,937 కోట్లు కాగా, ఈ సారి దాదాపు రూ. 570 కోట్ల మేర అదనంగా బడ్జెట్ పెంచారు.
డిసెంబర్ 15లోపు..: వాస్తవానికి అక్టోబర్‌లోనే బడ్జెట్‌కి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉన్నప్పటికీ నవంబర్ నెలాఖరు వరకు సమయం తీసుకున్నారు. డిసెంబర్ 15వ తేదీలోపు వార్షిక బడ్జెట్ అంచనాలు స్టాండింగ్ కమిటీ ఆమోదించాలని బల్దియా చట్టం పేర్కొంటుంది. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోపు జనరల్ బాడి మీటింగ్‌లో సభ్యుల ముందు చర్చ పెట్టి ఆమోద ముద్ర పొందాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పుల ఆనంతరం ఫిబ్రవరి 20లోపు అంచనాలను మంజూరు చేయాల్సి ఉంటుందని చట్టం చెబుతున్నది. మార్చి 1లోపు కార్పొరేషన్ బడ్జెట్ అంచనాల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. నిర్ణీత సమయంలో బడ్జెట్ ప్రక్రియను ముగిస్తారా? లేదంటే మార్పులు, చేర్పులతో ప్రభుత్వానికి సకాలంలో పంపించక కాలాయాపన చేస్తారా? అన్నది వేచి చూడాలి.