GHMC | సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో ఒక్కొక్కటిగా ప్రైవేట్‌పరం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం.. అప్పుల ఊబిలోకి సంస్థ కూరుకుపోతుండడం, నిర్వహణ లోపంతో పౌరులకు మెరుగైన సేవలందించడంలో విఫలమైన అధికారులు ప్రైవేట్ బాట పట్టారు. ఇప్పటికే మోడల్ మార్కెట్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ప్రైవేట్ వైపు చూపగా, తాజాగా నాలాలను సైతం ప్రైవేట్ ఏజెన్సీలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. గ్రేటర్లో వరద ముంపు సమస్య పరిష్కారంలో భాగంగా నాలాల నిర్వహణను ప్రైవేట్ బాధ్యతలు అప్పగించనున్నారు.
ఈ మేరకు జోన్ల వారీగా తీవ్ర ముంపునకు గురవుతున్న ప్రాంతాలు, నిర్వహణ సంక్షిష్టంగా ఉన్న నాలాల వివరాలను కేంద్ర కార్యాలయం సేకరిస్తున్నది. రోడ్డు, ఇతర ప్రాజెక్టుల మాదిరిగా నాలాల నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించనున్నారు. గ్రేటర్లో మొత్తం వరద ప్రవాహ వ్యవస్థ 1302 కిలోమీటర్లు ఉండగా, మేజర్‌గా నాలా 370 కిలోమీటర్లు, మైనర్ డ్రైన్స్ 912 కిలోమీటర్లు ఉంది. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని నాలాలను తొలుత ఎంపిక చేసి ఏడాది కాల వ్యవధికి ఏజెన్సీలకు ఇవ్వనున్నారు. సత్ఫలితాలు వస్తే దశల వారీగా ఇతర నాలాలకు విస్తరించనున్నారు. అయితే ఈ ప్రైవేట్ పేరిట ఏజెన్సీలకు దోచిపెట్టడమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) పద్ధతిలోకి తీసుకువస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఖైరతాబాద్ జోన్‌లోని అమీర్‌పేట, షేక్‌పేట స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఎంపిక చేశారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను మరింత బలోపేతం చేసి ఐదేండ్ల పాటు పీపీపీ పద్ధతిలో నిర్వహణను చేపట్టనున్నారు.
ఈ మేరకు ఆసక్తి గల ఏజెన్సీలు ప్రతిపాదనలు సమర్పించాలంటూ ఆర్ఎఫ్పీ టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 21న సాయంత్రం సాయంత్రం 5 గంటలకు టెండర్ దాఖలుకు తుది గడువు విధించారు. 28వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలకు టెండర్ తాలుకా దరఖాస్తులను తెరిచి.. అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. సదరు టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేసి ఐదేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించనున్నది. అన్ని రకాల రుసుంలను ఏటా 5-7శాతం మేర పెంచుకుని ఆ భారాన్ని క్రీడాకారులపై మోపనున్నారు.