సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగు పరిచేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సాయంతో జీహెచ్ఎంసీ సర్వే చేయించి.. 2640 చెత్త కుప్పలున్నట్లు తేల్చింది. వాటిని నివారించేందుకు వంద రోజుల ప్రణాళికలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే తాజాగా కొత్తగా ట్రై సైకిళ్లు (రిక్షాలు), వీల్ బార్స్ (చిన్న ట్రాలీ)లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ టెండర్లు పిలిచారు. ఒక్కో రిక్షాను గరిష్ఠంగా రూ. 24,600కు కొనుగోలు చేయాలని నిర్ణయించి.. ఈ మేరకు 1500 రిక్షాలు, మరో 1500 చిన్న ట్రాలీల కొనుగోలు టెండర్లు ఆహ్వానించారు. ఏ సంస్థ ఎంత ధరకు సరఫరా చేయగలదో చెప్పాలని, ఇందుకు టెండర్ గడువు వచ్చే నెల 14వ తేదీ వరకు విధించారు. నగరంలో చెత్త కుప్పలు లేని నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.