సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్లో చెత్త రహిత కాలనీలుగా మార్చేందుకు జీహెచ్ఎంసీ మరో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంది. వందకు వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్బేజి వనరేబుల్ పాయింట్లు/జీవీపీ)పై యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ ప్రక్రియ జరుగుతుండగా..అక్కడకక్కడ కొందరు బహిరంగంగానే చెత్త వేస్తున్నారు. ఇలా గ్రేటర్ వ్యాప్తంగా 2640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) జరిపిన సర్వేలో తేలింది.
ఇదే విషయాన్ని కమిషనర్ రోనాల్డ్ రోస్ సీరియస్గా తీసుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు.. పారిశుద్ధ్యం నిర్వహణపై ఏజెన్సీ, ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో జీవీపీ పాయింట్లపై ప్రత్యేకంగా చర్చించారు. ఇందులో భాగంగానే కాలనీల వారీగా మార్పును తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు కేపీహెచ్బీ డివిజన్ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కేపీహెచ్బీ కాలనీలో 44 చోట్ల బహిరంగంగా వ్యర్థాలను పారబోస్తున్నట్లు గుర్తించారు. ఈ డివిజన్లో చెత్త రహిత కాలనీలుగా మార్చే క్రమంలో జీవీపీ పాయింట్ల వద్ద మూడు విడుతల్లో నిరంతరం పర్యవేక్షణకు ఎస్ఎఫ్ఏ (పారిశుద్ధ్య సూపర్ వైజర్ల) సిబ్బందిని నియమించారు. ఎవరెవరూ చెత్త పారబోస్తున్నారు? గుర్తించి వారి వివరాలను నమోదు చేస్తున్నారు.
వారి ఇంటికి స్వచ్ఛ ఆటో వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు కాలనీ అసోసియేషన్లను భాగస్వామ్యం చేస్తూ చెత్త రహిత కాలనీలుగా తీర్చిదిద్దుతున్నారు. కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ మమత ఆధ్వర్యంలో అధికారులు కేపీహెచ్బీ కాలనీలో 69 సంక్షేమ సంఘాలకు అవగాహన కల్పించారు. బహిరంగ చెత్త వ్యర్థాల పారబోత ప్రదేశాల్లో ఎస్ఎఫ్ఏలను సమన్వయం చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ఆలయాలు, హోటళ్లు, దవాఖాన తదితర వ్యర్థాల పారబోసే వారి జాబితాలను ఆయా ఏఎస్ఏలు జాబితాను తయారు చేసి వారి వద్దకే స్వచ్ఛ ఆటోలు వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు.